
IND vs WI Super 8 : టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత కీలకమైన ఘట్టం ఆసన్నమైంది. సూపర్-8 రౌండ్‌లో ఆఖరి రోజైన ఆదివారం (మార్చి 1) జరిగే భారత్ వర్సెస్ వెస్టిండీస్ పోరు ఇప్పుడు డూ ఆర్ డైగా మారింది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సెమీఫైనల్‌కు దూసుకెళ్తారు, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే ఈరోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చరిత్రను తిరగరాయాల్సిందే. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ రికార్డులు చూస్తే వెస్టిండీస్ చేతిలో భారత్‌కు చేదు జ్ఞాపకాలే ఎక్కువగా ఉన్నాయి.
సరిగ్గా పదేళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. చివరిసారిగా 2016లో భారత్ వేదికగా జరిగిన సెమీఫైనల్‌లో వెస్టిండీస్ మన జట్టును ఓడించి ఫైనల్‌కు వెళ్లి కప్పు కొట్టింది. ఇప్పుడు మళ్లీ అదే భారత గడ్డపై, సెమీస్ బెర్తు కోసం జరుగుతున్న పోరులో విండీస్‌ను ఓడించి పాత బాకీ తీర్చుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సేన పట్టుదలగా ఉంది. అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన 4 మ్యాచ్‌లలో వెస్టిండీస్ 3 సార్లు గెలవగా, భారత్ కేవలం ఒక్కసారి (2014లో) మాత్రమే విజయం సాధించింది. ఈ రికార్డు టీమ్ ఇండియాను కాస్త కలవరపెడుతున్నా, ప్రస్తుత ఫామ్ మీద నమ్మకంతో ఉంది.
ఓవరాల్ టీ20 రికార్డులను పరిశీలిస్తే మాత్రం భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన 30 అంతర్జాతీయ టీ20ల్లో భారత్ 19 సార్లు నెగ్గగా, వెస్టిండీస్ 10 సార్లు గెలిచింది (ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు). ఇక ఈ మ్యాచ్ జరుగుతున్న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం భారత్‌కు అచ్చొచ్చిన మైదానం. ఇక్కడ వెస్టిండీస్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారతే విజయం సాధించింది. కానీ విండీస్ జట్టుకు కూడా ఈ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ స్టేడియంలో వారు ఆడిన మూడు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ‘అజేయంగా’ నిలిచారు.
ఈ కీలక పోరులో రింకు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు జట్టులోకి తిరిగి రావడం భారత్‌కు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. వెస్టిండీస్ హిట్టర్లను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు శ్రమించక తప్పదు. ఆదివారం రాత్రి కోల్‌కతా వేదికగా జరిగే ఈ సమరంలో నెగ్గి సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టే నాలుగో జట్టుగా భారత్ నిలుస్తుందా? లేక విండీస్ మరోసారి షాక్ ఇస్తుందా? అనేది కోట్లాది మంది క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..