India Vs West Indies, 4th T20I: టీమిండియా 178 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌పై యశస్వి జైస్వాల్ అజేయంగా 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో టీమిండియా T20I సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. యశస్వి జైస్వాల్ దేశం తరపున తన తొలి T20I (T20 International) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
ఈ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 11 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనింగ్ భాగస్వామి శుభ్‌మన్ గిల్ అతనికి సరైన సహకారం అందించాడు. శుభమాన్ గిల్ 77 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
మ్యాచ్ అనంతరం యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ.. ‘అమెరికా వెళ్లి ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉంది. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. నేను వేగంగా పరుగులను చేసేందుకు ప్రయత్నిస్తాను. పవర్‌ప్లేలో నేను ఎన్ని షాట్‌లు ఆడగలనో చూస్తాను. వికెట్‌ను, పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘తనపై నమ్మకం ఉంచినందుకు కెప్టెన్, అతని సహచరులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ యశస్వి జైస్వాల్ ధన్యవాదాలు. అంతర్జాతీయ క్రికెట్ అంత సులభం కాదు. కానీ, నేను నా బ్యాటింగ్‌ను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను. హార్దిక్ భాయ్, సహచర జట్టు సభ్యులు నన్ను విశ్వసిస్తున్న తీరు పట్ల నేను సంతోషిస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు.
శుభ్‌మన్ గిల్‌తో భాగస్వామ్యం గురించి అడిగినప్పుడు, ‘శుభ్మన్‌తో ఇది గొప్ప భాగస్వామ్యం. ఏ బౌలర్లను ఎదుర్కోవాలో మాకు తెలుసు. బౌలర్లపై పక్కా ప్రణాళికతో ఆడాం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ, ‘అతను (శుభ్మన్ గిల్) చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మేం ఏ బౌలర్‌పై దూకుడుగా వ్యవహరించాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. మా భాగస్వామ్యానికి ఇది అవసరం’ అంటూ పేర్కొన్నాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఇద్దరు యువకుల ప్రయత్నాలను కొనియాడాడు. వారి నైపుణ్యాలు అద్భుతం అంటూ ప్రశసించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డు వేడుకలో హార్దిక్ పాండ్యా ఓపెనర్లపై ప్రశంసలు కురిపిస్తూ.. ‘శుభ్మన్, యశస్వీ అద్భుత ప్రదర్శన చేశారు. మనం చూసినట్లుగా, వారి నైపుణ్యంపై సందేహం లేదు. క్రీజులో కొంత సమయం గడిపి, పరిస్థితులను అర్థం చేసుకుని, అద్భుతంగా బ్యాటింగ్ చేశారు’ అంటూ పొగిడేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..