India Vs South Africa: డిసెంబర్ 26 నుంచి భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. భారత్ ఈ సుదీర్ఘ పర్యటనలో, కరోనా కొత్త వేరియంట్ దెబ్బకు కత్తెర పడింది. దీంతో టీ20 సిరీస్‌ను వాయిదా వేశారు. టెస్టు సిరీస్‌ను కూడా 3 మ్యాచ్‌లకు కుదించారు. దీంతో పాటు 3 వన్డేల సిరీస్ ఆడనున్నారు. దక్షిణాఫ్రికా టూర్‌లో, టెస్ట్ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు అక్కడి మూడు మైదానాలు, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్‌లలో జరుగుతాయి. ఈసారి దక్షిణాఫ్రికాలో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు మ్యాచ్‌లు ఆడే 3 గ్రౌండ్స్‌లో తెల్ల దుస్తులతో టీమ్‌ఇండియా పెర్ఫార్మెన్స్ కార్డ్‌ని ఓ సారి పరిశీలిద్దాం.
టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు సెంచూరియన్‌లో జరగనుంది. ఇక్కడి సూపర్ స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో టీమిండియా ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఈ మైదానంలో భారత్ 2 టెస్టులు ఆడగా, రెండూ ఓడిపోయింది.
టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ జనవరి 3 నుంచి 7 మధ్య జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానంలో జరగనుంది. ఈ మైదానాన్ని టీమ్ ఇండియా చాలా ఇష్టపడుతుంది. ఇప్పటి వరకు ఈ మైదానంలో భారత్ ఆడిన ఏ టెస్టులోనూ ఓడిపోలేదు. భారత్ ఇక్కడ 5 టెస్టులు ఆడగా అందులో 2 గెలిచి 3 డ్రా అయ్యాయి.
టెస్టు సిరీస్‌లో మూడోది, చివరి మ్యాచ్ జనవరి 11 నుంచి 15 మధ్య కేప్‌టౌన్‌లో జరగనుంది. కేప్‌టౌన్‌లో కూడా భారత్ ఆడిన ఏ టెస్టులోనూ విజయం సాధించలేదు. ఇక్కడ ఆడిన 5 టెస్టుల్లో 3 ఓడిపోయాడు. కాగా 2 టెస్టులు డ్రా అయ్యాయి.
దక్షిణాఫ్రికాలో తొలిసారిగా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న ఘనత భారత్‌కు దక్కాలంటే సెంచూరియన్, కేప్‌టౌన్‌ల చరిత్రను మార్చక తప్పదని స్పష్టమవుతోంది. మిగిలిన జోహన్నెస్‌బర్గ్ చరిత్ర ఎలాగు భారత్‌కు అనుకూలంగానే ఉంది.