
IND vs SA 5th T20I : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదో టీ20 సమరంలో టాస్ ముగిసింది. ఈ నిర్ణయాత్మక పోరులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉండగా, ఈ మ్యాచ్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై సొంత గడ్డపై భారత్ ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవలేదు. ఈరోజు గెలిస్తే ఆ లోటు తీరిపోతుంది.
ఈ కీలక పోరు కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడు ప్రధాన మార్పులు చేసింది. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన స్పీడ్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రాగా, గాయపడిన శుభ్‌మన్ గిల్ స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. అలాగే కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు చోటు దక్కింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా కాలి బొటనవేలికి గాయం కావడంతో గిల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు తన పేసర్ అన్రిచ్ నోకియాను పక్కన పెట్టి, స్పిన్నర్ జార్జ్ లిండేను బరిలోకి దింపింది.
ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మపైనే ఉన్నాయి. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు కొట్టేందుకు అతను కేవలం 47 పరుగుల దూరంలో ఉన్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్ (ఏడాది)లో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ (2016లో 1614 పరుగులు) రికార్డును అభిషేక్ అధిగమించే అవకాశం ఉంది. అదే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ టీమిండియాను కాస్త కలవరపెడుతోంది. ఈ ఏడాది ఆడిన 18 ఇన్నింగ్స్‌ల్లో సూర్య ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడంతో, ఈరోజు భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
దక్షిణాఫ్రికా జట్టుకు కూడా ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే వారు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. 2023 జనవరి నుంచి ఆడిన 13 ద్వైపాక్షిక సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. ఈ గణాంకాలు చూస్తుంటే ఆ జట్టు ఎంతటి ఒత్తిడిలో ఉందో అర్థమవుతోంది. అయితే, అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టి భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళ మంచు కురిసే ఛాన్స్ ఉన్నందున, ఛేజింగ్ చేసే జట్టుకు ప్రయోజనం ఉంటుందని భావించి దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మరి భారత బ్యాటర్లు దక్షిణాఫ్రికా బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
ఇరు జట్లు స్క్వాడ్స్ ఇవే
టీమిండియా : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
దక్షిణాఫ్రికా స్క్వాడ్ : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్కరం (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జెన్సన్, కార్బిన్ బాష్, లుంగీ ఎన్గిడి, ఓట్నీల్ బార్ట్‌మాన్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..