
Vaibhav Suryavanshi : అండర్-19 వరల్డ్ కప్ 2026లో అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 1వ తేదీన క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మహా సంగ్రామం జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికి వార్తల్లో నిలిచిన వైభవ్, ఈ మ్యాచ్‌లో చెలరేగితే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. అయితే పాకిస్థాన్‌పై వైభవ్‌కు ఉన్న గత రికార్డులు మాత్రం అంత ఆశాజనకంగాలేవు. ఈ నేపథ్యంలో పాత లెక్కలు సరిచేయడానికి వైభవ్ సిద్ధమవుతున్నాడు.
వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు పాకిస్థాన్‌పై మూడు అండర్-19 వన్డేలు ఆడాడు. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లో కలిపి అతను చేసిన పరుగులు కేవలం 32 మాత్రమే. సగటు కేవలం 10.66గా ఉంది. గత ఏడాది జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పుడు, వైభవ్ చేసిన 26 పరుగులే పాకిస్థాన్‌పై అతని అత్యధిక స్కోరు. అంటే, ఒక స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌కు పాక్ ఒక పెద్ద సవాలుగా మారింది. ఈసారి వరల్డ్ కప్ వేదికగా తనపై ఉన్న విమర్శలకు సమాధానం చెప్పడమే కాకుండా, తన వ్యక్తిగత రికార్డును మెరుగుపరుచుకునేందుకు ఇది గొప్ప అవకాశం.
పాకిస్థాన్‌ను ఓడించడం కేవలం ప్రతిష్టాత్మకమే కాదు, టెక్నికల్‌గా కూడా భారత్‌కు చాలా ముఖ్యం. రేపటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, పాకిస్థాన్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. ఈ మ్యాచ్ గురించి వైభవ్ సహచర ఆటగాళ్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుండు, దీపేష్ దేవేంద్రన్, హేనిల్ పటేల్ ఈ మ్యాచ్‌ను ఒక సాధారణ ఆటగా పరిగణిస్తూనే, తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒత్తిడికి లోనుకాకుండా సహజ సిద్ధమైన ఆట ఆడటమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
అండర్-19 వరల్డ్ కప్ చరిత్రను తిరగేస్తే భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 10 సార్లు తలపడ్డాయి. విశేషమేమిటంటే..రెండు జట్లు తలో 5 మ్యాచ్‌లు గెలిచి సమానంగా ఉన్నాయి. ఈ రికార్డును బట్టి చూస్తే రేపటి మ్యాచ్ ఎంత హోరాహోరీగా సాగనుందో అర్థం చేసుకోవచ్చు. భారత్ తన ఆరో విజయం కోసం చూస్తుంటే, పాక్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని తహతహలాడుతోంది. వైభవ్ సూర్యవంశీ క్రీజులో నిలబడితే పాక్ బౌలర్లకు కష్టాలు తప్పవు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..