IND vs PAK Head to Head Records: ఆదివారం డబుల్ హెడర్ మ్యాచులో భాగంగా రెండో మ్యాచులో భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంలు తలపడనున్నాయి. ఈ రెండు టీంలు ఇదే మ్యాచుతో టీ20 ప్రపంచ కప్‌లో తమ ప్రయాణాలను మొదలుపెట్టనున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ అత్యధిక విజయాలతో నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచ కప్‌లో భారత్ ఓడిపోలేదు. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది. 2007 వరల్డ్ కప్ బౌలౌట్‌తో మొదలైన భారత్ విజయ ప్రస్థానం 2016 ప్రపంచకప్ వరకు కొనసాగింది. గత 5 మ్యాచ్‌లలో.. ఏ మ్యాచ్‌లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం..!
మ్యాచ్-1..
2007 టీ 20 వరల్డ్ కప్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే టెన్షన్ టెన్షన్..
సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్ పాక్ తోనే ఆడింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ధోనీసేన, నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 141 రన్స్ చేసింది. రాబిన్ ఉతప్ప (50), ధోనీ (33), ఇర్ఫాన్ పఠాన్ (20) రాణించారు. ఆ తర్వాత దిగిన పాక్ మిస్బాఉల్‌హక్ (53), షోయబ్ మాలిక్ (20) పోరాటంతో ఏడు వికెట్ల నష్టానికి
సరిగ్గా 141 పరుగులే చేయగలిగింది. దీంతో, ఫలితాన్ని బౌలౌట్ పద్దతి ద్వారా తేల్చారు. ఈ పద్దతిని ముందే గ్రహించి ప్రాక్టీస్ చేసిన భారత్ బౌలౌట్‌లో ఇరగదీసింది. స్పిన్ బౌలింగ్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప వికెట్లను గురి చూసి కొట్టగా.. పాక్ బౌలర్లు మాత్రం విఫలమయ్యారు. దీంతో 3-0 తేడాతో బౌలౌట్‌లో టీమిండియా విజయం సాధించింది.
మ్యాచ్-2.. 2007 వరల్డ్ కప్ ఫైనల్: ఆ టోర్నీ ఫైనల్లో కూడా భారత్-పాక్ మరోసారి తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ (75), రోహిత్ శర్మ (30) రాణించారు. ఆ తర్వాత 158 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 152 పరుగులకే ఆలౌటైంది. పాక్ తరపున అత్యధిక స్కోరు మిస్బా ఉల్ హక్-43, ఇమ్రాన్ నజీర్-33గా నిలిచారు. 19.2 ఓవర్లలో 152/9 చేసింది. 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన సమయంలో.. జోగీందర్‌శర్మ బౌలింగ్‌లో ర్యాంగ్ షాట్‌కు ప్రయత్నించిన మిస్బా ఉల్ హక్, శ్రీశాంత్ క్యాచ్ పట్టడంతో టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్‌ను పట్టుకుంది. బౌలింగ్‌లో ఆర్పీ సింగ్ (3/26), ఇర్ఫాన్ పఠాన్ (3/16), జోగిందర్ శర్మ (2/20) అద్భుత బౌలింగ్‌తో భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసి కప్ అందుకుంది
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ స్కోర్, బ్లాగ్‌ను ఇక్కడ చూడండి
మ్యాచ్-3.. 2012 వరల్డ్ కప్ :
సూపర్-8 లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో ముందు పాక్‌ను 128 పరుగులకే టీమిండియా ఆలౌట్ చేసింది. పాక్ జట్టులో అత్యధిక స్కోరు-28 (షోయబ్ మాలిక్)గా నమోదైంది. లక్ష్మీపతి బాలాజీ 3 వికెట్లు, అశ్విన్-2, యువరాజ్-2 వికెట్లు తీయగా, కోహ్లీ కూడా 1 వికెట్ తీయడం విశేషం. తరువాత కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. 61 బంతుల్లో 78 పరుగులు చేసి ఒంటి చేత్తో విరాట్ కోహ్లీ విజయాన్నందించాడు.
మ్యాచ్-4.. 2014 వరల్డ్ కప్ :
ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండగా.. భారత బౌలర్లు సమష్టిగా రాణించి పాక్‌ను 130/7 స్కోరుకే పరిమితం చేశారు. పాక్ తరపున అత్యధిక స్కోరు ఉమర్ అక్మల్-33 గా ఉంది. అమిత్ మిశ్రా కు 2 వికెట్లు, జడేజా, భువనేశ్వర్, షమీ లకు ఒక్కొక్క వికెట్ దక్కింది. ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణించడంతో టీమిండియా 48.3 ఓవర్లలో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ-36, సురేష్ రైనా-35, శిఖర్ ధావన్-30, రోహిత్ శర్మ-24 పరుగులు చేశారు.
మ్యాచ్-5.. 2016 వరల్డ్ కప్:
భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇరు దేశాలు ఒకే గ్రూప్‌లో తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ చేతిలో భారత్ 79 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది. దీనితో పాక్ విజయం సులువనుకున్నారంతా. కానీ భారత్ దుమ్మురేపింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకే కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను 118/5 స్కోరుకే భారత్ కట్టడి చేసింది. అత్యధిక స్కోరు షోయబ్ మాలిక్-26, 5గురు భారత బౌలర్లకు తలో వికెట్ దక్కింది. ఆ తర్వాత టీమిండియా 4 వికెట్లు నష్టపోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఒక దశలో 23 కే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో యువరాజ్, ధోనీ అండతో విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 55 పరుగులు చేసి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.
ఇక, తాజా టీ-20 వరల్డ్ కప్ లోనూ టీమిండియా అదే జోరు, సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. దాయాదిని చిత్తు చేయాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.