IND vs ENG: సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లార్డ్స్ టెస్ట్‌లో ఎన్నడూ టెస్టు సెంచరీ నమోదు చేయలేదు. వీరి సరసన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరతాడేమోనని అభిమనాలు కలవరపడుతున్నారు. ఈ చారిత్రాత్మక మైదానంలో మూడు అంకెలను చేరుకోవాలని, అలాగే సెంచరీ కరువును తీర్చుకోవాలని విరాట్ ప్రయత్నిస్తున్నాడు. గత తొమ్మిది టెస్టు మ్యాచ్‌లలో 15 ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో 27 సెంచరీలు చేశాడు. కానీ, నవంబర్ 2019 నుంచి కోహ్లీ మూడు అంకెలను చేరుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నాడు. 15 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 345 పరుగులు చేశాడు. సగటు 23.00గా ఉంది.
లార్డ్స్‌లో గురువారం నుంచి జరిగే రెండో టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడాల్సి ఉంది. లార్డ్స్‌లో భాతర లెజెండ్‌ల గత రికార్డులు పరిశీలిస్తే.. గవాస్కర్ ఈ మైదానంలో 10 ఇన్నింగ్స్‌లలో 340 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే సచిన్ ఇక్కడ ఆడిన తొమ్మిది టెస్టు ఇన్నింగ్స్‌లలో 50 పరుగులు కూడా చేయలేదు. కోహ్లీ మాత్రం ఇలాంటి రికార్డును చేరుకోకూడనుకుంటున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ లార్డ్స్‌లో ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు. లార్డ్స్‌లో కోహ్లీ అత్యధిక స్కోరు 25 పరుగులుగా నిలిచింది. నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ తొలి బంతికే ఔట్ అయ్యాడు. లార్డ్స్‌లో భారత్‌కు మూడో విజయాన్ని అందించాలంటే భారీ స్కోర్ చేయకతప్పదు.
పుజారా పరిస్థితి కూడా అంతే..
టీమిండియా మరో బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా కూడా కోహ్లీనే పోలి ఉన్నాడు. గత 32 ఇన్నింగ్స్‌లో పుజారా టెస్ట్ సెంచరీ చేయలేదు. ఇందులో 27.64 సగటుతో 857 పరుగులు చేశాడు. పుజారా లార్డ్స్‌లో రెండు మ్యాచ్‌లు కూడా ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 89 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 43 పరుగులు. ప్రస్తుత భారత జట్టులో అజింక్య రహానె తప్ప, లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లలో ఏ ఇతర బ్యాట్స్‌మన్ సెంచరీ చేయలేకపోయాడు. ఈ చారిత్రాత్మక మైదానంలో 2014లో జరిగిన టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసిన రహానే.. ఇంగ్లండ్‌పై 95 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రోహిత్-పంత్ లార్డ్స్‌లో మొదటిసారి..
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్ లార్డ్స్‌లో తొలిసారి బరిలోకి దిగనున్నారు. అయితే కేఎల్ రాహుల్ 2018 లో ఏకైక టెస్టు ఆడాడు. ఇందులో రెండు ఇన్నింగ్స్‌లలో 18 పరుగులు చేశాడు. అలాగే దిలీప్ వెంగ్ సర్కార్ పేరిట లార్డ్స్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన రికార్డు ఉంది. అతను 1979 లో ఈ మైదానంలో 107 పరుగులతో సత్తా చాటాడు. అలాగే 1982 లో 157 పరుగులు, 1986 లో 126 నాటౌట్‌తో నిలిచాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 1986లో లార్డ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మొదటిసారి గెలిచింది. లార్డ్స్‌లో ఇప్పటి వరకు మొత్తం 18 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
PV Sindhu: పీవీ సింధుకు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పి.. ఘనంగా సన్మానించిన హైదరాబాద్ పోలీసులు