వచ్చేశాడ్రోయ్ టీమిండియా తోపు.. 3 ఏళ్ల తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ.. ఇక చుక్కలే..!

India vs England ODI: మూడేళ్ల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా వన్డే క్రికెట్‌లోకి రావడం భారత్‌కు కొండంత బలాన్ని ఇస్తోంది. ప్రపంచకప్ ఓటమి బాధను మర్చిపోయి, 2027 ప్రపంచకప్‌పై గురిపెట్టిన టీమిండియాకు బుమ్రా పునరాగమనం శుభసూచికం. ఇంగ్లండ్ గడ్డపై యార్కర్ల కింగ్ మళ్లీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

వచ్చేశాడ్రోయ్ టీమిండియా తోపు.. 3 ఏళ్ల తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ.. ఇక చుక్కలే..!
Ind Vs Eng Team India Squad

Updated on: Jun 21, 2026 | 7:56 PM

Jasprit Bumrah Comeback: ఆ పరాజయం కలిగించిన గాయం మాసిపోలేదు.. ఆ కన్నీటి జ్ఞాపకం ఇంకా గుండెల్లో సలపరం పెడుతూనే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత దాదాపు మూడేళ్లపాటు వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉన్న టీమిండియా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో బుమ్రా పునరాగమనం అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది.

మిషన్ 2027.. బుమ్రా రాకతో మొదలైన వేట..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంగ్లండ్ పర్యటన కోసం సరికొత్త వ్యూహాలతో కూడిన బలమైన వన్డే జట్టును ప్రకటించింది. జులై 14 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్ కేవలం ఒక ద్వైపాక్షిక పోరు మాత్రమే కాదు. 2027 వన్డే ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా టీమిండియా తలపెట్టిన సుదీర్ఘ మిషన్‌కు ఇది తొలి అడుగు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంటూ, భారత ప్రధాన పేస్ అస్త్రం జస్ప్రీత్ బుమ్రాను వన్డే జట్టులోకి తిరిగి తీసుకువచ్చారు.

గాయం కాదు.. పనిభార నిర్వహణ కోసమే ఈ విరామం..!

అహ్మదాబాద్ వేదికగా 2023 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లోనే బుమ్రా చివరిసారిగా నీలం రంగు జెర్సీలో వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి బుమ్రాను వన్డే ఫార్మాట్‌కు పూర్తిగా దూరంగా ఉంచారు. అతడి ఫిట్‌నెస్‌ను కాపాడటానికి, అదేవిధంగా ఆటగాళ్లపై పడే విపరీతమైన పనిభారాన్ని (వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్) సమర్థవంతంగా నిర్వహించడానికి సెలెక్షన్ కమిటీ అతడికి ఈ సుదీర్ఘ విరామం ఇచ్చింది. ఇప్పుడు పూర్తి విశ్రాంతి తీసుకుని, సరికొత్త శక్తితో, మరింత పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల పనిపట్టడానికి బుమ్రా సిద్ధమయ్యాడు.

ఇంగ్లండ్‌కు సింహస్వప్నం.. బుమ్రా సంచలన రికార్డులు..!

జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రావడం ఇంగ్లండ్ బ్యాటింగ్‌ లైనప్‌కు నిజంగానే ఓ పీడకల లాంటిది. ఇంగ్లండ్ జట్టుపై బుమ్రాకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆ జట్టుపై ఆడిన 7 వన్డేల్లో కేవలం 5.88 ఎకానమీతో ఏకంగా 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అద్భుత ప్రదర్శన కూడా ఉంది. ఇక ఇంగ్లండ్ పిచ్‌లపై బుమ్రా శైలి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అక్కడ ఆడిన 16 వన్డేల్లో కేవలం 4.52 అత్యుత్తమ ఎకానమీతో 30 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ గణాంకాలే ఇంగ్లండ్ గడ్డపై అతడు ఎంతటి విధ్వంసం సృష్టించగలడో స్పష్టం చేస్తున్నాయి.

ఇంగ్లండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టు:

యువ సంచలనం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బీసీసీఐ అనుభవజ్ఞులు, యువ రక్తం కలగలిసిన జట్టును ఎంపిక చేసింది. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఈ జట్టులో చోటు దక్కడం విశేషం.

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us