Birmingham Weather Report: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న పటౌడీ సిరీస్‌లో 5వ టెస్టుకు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. ఈ వార్త వినగానే భారత ఆటగాళ్లు ముఖ్యంగా బౌలర్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దీంతో టీమిండియా ఆశలు నెరవేరేందుకు, చరిత్రలో నిలిచేందుకు ఓ అవకాశం రానుంది. ఇంగ్లాండ్‌లో 15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికే విజయం దక్కనుంది. శుభవార్త ఏంటంటే.. బర్మింగ్‌హామ్ వాతావరణానికి సంబంధించింది. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు వస్తున్న వాతావరణ నివేదిక ప్రకారం.. ఇకపై తదుపరి గేమ్‌కు వర్షం అంతరాయం ఉండదని తెలుస్తుంది. దీంతో ఇంగ్లండ్ టెన్షన్ మరింత పెరిగింది.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో వర్షం కారణంగా తొలి రెండు రోజుల ఆట చాలాసేపు నిలిచిపోయింది. మొదటి రోజు వర్షం కారణంగా గంటన్నర ఆట నిలిచిపోయింది. దీని కారణంగా 73 ఓవర్లు మాత్రమే వేయగలిగారు. అదే సమయంలో రెండో రోజు ఆటలో తొలిరోజు కంటే వర్షం ఎక్కువ ప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో, నాల్గవ, ఐదో రోజు పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
రాబోయే 3 రోజులలో బర్మింగ్‌హామ్‌లో వాతావరణ పరిస్థితులు..
Accuweather.com ప్రకారం, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మూడో రోజు అంటే జులై 3న వర్షం పడే అవకాశం ఉంది. కానీ మొదటి రెండు రోజులంతగా ఉండదంట. మూడో రోజు మ్యాచ్‌లో కేవలం 25% మాత్రమే వర్షం వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో, ఉష్ణోగ్రత 10 నుంచి 20 డిగ్రీల మధ్య ఉంటుంది. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు వాతావరణం స్పష్టంగా ఉంటుంది. ఈ రోజున వర్షం పడే అవకాశం కేవలం 3% మాత్రమే ఉంది. ఇక చివరి, ఐదవ రోజు అంటే జులై 5న కూడా వాతావరణం స్పష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. 5వ రోజు వర్షం పడే అవకాశాలు 12%గా నమోదయ్యాయి. ఈ సమయంలో ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది.
ఓవరాల్‌గా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 3 రోజుల పాటు వాతావరణం స్పష్టంగా ఉండనుంది. ఇలాంటి వాతావరణం బౌలర్‌లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిలో భారత బౌలర్లు విధ్వంసం సృష్టించే తీరు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ఇంగ్లండ్.. వాతావరణ రూపంలో కొత్త టెన్షన్ పట్టుకుంది.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ ఆధిపత్యం..
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో తొలి రెండు రోజుల్లో భారత్ ముందుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటవ్వగా, ఇంగ్లాండ్ టీం రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఇంకా 332 పరుగులు వెనుకంజలో నిలిచింది. అంటే మ్యాచ్‌లో టీమిండియా పూర్తి పట్టు సాధించింది.