
IND vs ENG 5th T20I : ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటికే టీ20 సిరీస్‌ను చేజార్చుకున్న భారత క్రికెట్ జట్టు ఆఖరి పోరులో ఒక ఊహించని నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్టులో మేనేజ్‌మెంట్ రెండు కీలక మార్పులు చేసింది. ఇందులో అత్యంత ప్రధానంగా వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకువచ్చింది. సిరీస్ కోల్పోయినప్పటికీ, ఈ మ్యాచ్‌లో గెలిచి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని కాపాడుకోవాలని భారత్ చూస్తోంది.
ఈ సిరీస్‌లోని రెండవ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. భారత పురుషుల క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన (15 ఏళ్లు) ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఆరంభంలో అతనికి పూర్తి సిరీస్ ఆడే అవకాశం ఇస్తారని భావించినప్పటికీ, వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో మేనేజ్‌మెంట్ అతనిపై వేటు వేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి మొత్తం 42 రన్స్ కే పరిమితమయ్యాడు. ప్రతి మ్యాచ్‌లోనూ కొన్ని బౌండరీలతో ఇన్నింగ్స్‌ను మెరుపుతీరుతో ప్రారంభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో ఘోరంగా విఫలమయ్యాడు.
వైభవ్ సూర్యవంశీ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌కు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌ల్లో వరుసగా ఫెయిల్ కావడంతో గతంలో సంజూను పక్కనబెట్టారు. అయితే ప్రస్తుత సిరీస్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ సైతం దారుణంగా విఫలమవుతున్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం యువ ఆటగాడిపైనే వేటు వేయడం గమనార్హం. ఇక జట్టులో జరిగిన రెండో మార్పు విషయానికి వస్తే.. గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న వాషింగ్టన్ సుందర్‌ను పక్కనబెట్టి, ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్గేను జట్టులోకి తీసుకున్నారు.
ఈ ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందే మైదానం వెలుపల ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. టీమిండియా ప్రయాణిస్తున్న బస్సు సౌతాంప్టన్ వీధుల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. దీనివల్ల భారత ఆటగాళ్లు స్టేడియానికి అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యంగా చేరుకున్నారు. ఈ అంతరాయం కారణంగా మ్యాచ్ షెడ్యూల్ టైమ్ కంటే సుమారు అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి 7:15 గంటలకు టాస్ పడగా, భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. విశేషం ఏంటంటే.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించిన గత ఏడు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచాడు కానీ, దురదృష్టవశాత్తూ ఆ మ్యాచ్‌ల్లో టీమిండియా ఒక్కటి కూడా గెలవలేకపోయింది.
ఇరు జట్ల తుది ఆటగాళ్ల వివరాలు :
భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..