Dinesh Karthik vs Rishabh Pant: టీమ్ ఇండియాలో అందరి స్థానం ఫిక్సయిపోయింది. ప్రతి ఒక్కరి పాత్ర అందరికీ తెలిసిందే. అయితే, ఇద్దరి స్థానాల్లో మాత్రం ఇంకా సందిగ్ధం నెలకొని ఉంది. వారిలో దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ తమ స్థానాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యారు. అయితే వీరిలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరు కనిపిస్తారనేది ఇప్పటివరకు పెద్ద ప్రశ్నగా మారింది. నాగ్‌పూర్ టీ20 తర్వాత బహుశా రోహిత్ శర్మకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికి ఉంటుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ టీ20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకకంగా భావిస్తున్నారు. తన బలాబలాలను పరీక్షించుకోవడం, బలహీనతలను అర్థం చేసుకోవడమే టీమ్ ఇండియా ఇందులో ప్రయత్నిస్తోంది. ఇదే ఎపిసోడ్‌లో కార్తీక్ వర్సెస్ పంత్ అనే ప్రశ్నకు సమాధానం దొరికింది.
నమ్మకాన్ని నిజం చేసిన దినేష్ కార్తీక్..
నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో T20 ముగిసిన తర్వాత దినేష్ కార్తీక్ ప్లేయింగ్ XIలో చేరే అవకాశం మరింత మెరుగుపడింది. నిజానికి, ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ టీ20లో రోహిత్ శర్మ పెట్టిన టెస్ట్‌లో దినేష్ పాసయ్యాడు. అది ఎలా అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. దినేష్ కార్తీక్ పాసయిన తీరు.. తన కెప్టెన్ నమ్మకాన్ని కూడా గెలుచుకున్న తీరును ఓసారి చూద్దాం..
DK – The Finisher ⚡️ #INDvAUS pic.twitter.com/udmOkQmZCN
— DD Sports – National Games 2022 ?? (@ddsportschannel) September 23, 2022
మొన్న మెడ.. నేడు కౌగిలింత..
దినేష్ కార్తీక్ రెండో టీ20లో ఆడింది కేవలం 2 బంతులు మాత్రమే. ఆస్ట్రేలియాపై గెలిచేందుకు హార్దిక్ వికెట్ పడిన తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు రావాలి. కానీ, హిట్ మ్యాన్ మాత్రం దినేష్ కార్తీక్‌ను బరిలోకి దిగాలని కోరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కార్తీక్.. 2 బంతుల్లోనే భారత్‌కు విజయం చేకూర్చాడు. కార్తీక్ మ్యాచ్ ముగింపు శైలిని చూసిన రోహిత్ శర్మ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అతనిని కౌగిలించుకున్నాడు. అంతకుముందు జరిగిన తొలి టీ20లో మాత్రం సరిగ్గా అప్పీల్ చేయనందుకు మెడ పట్టుకుని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా, రోహిత్ మాత్రం రిషబ్ కంటే దినేష్ కార్తీక్‌పైనే నమ్మకాన్ని ఉంచాడు.
చివరి ఓవర్‌లో 10 పరుగులు చేయాల్సి ఉండగా, 2 బంతుల్లోనే మ్యాచ్ ముగించిన కార్తీక్..
నిజానికి నాగ్‌పూర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌పై వర్షం ప్రభావం పడింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చెరో 8 ఓవర్లు మాత్రమే ఆడేందుకు నిర్ణయించారు. దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, మ్యాచ్ చివరి దశలో ఉంది. చివరి ఓవర్లో భారత్ విజయానికి 10 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, దినేష్ కార్తీక్ ఈ 10 పరుగులు చేయడానికి మొత్తం ఓవర్ వరకు వేచి ఉండలేదు. మొదటి రెండు బంతుల్లోనే ఆట ముగించాడు.
పంత్ కంటే కార్తీక్‌పైనే నమ్మకముంచిన రోహిత్..
కార్తీక్ మొదటి బంతికి సిక్స్, రెండవ బంతిని ఫోర్ కొట్టాడు. దీంతో ఆట ముగిసింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కార్తీక్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ ప్రస్తుతం బెంచ్‌కే పరిమితం అయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే పద్ధతిని టీ20 ప్రపంచ కప్ 2022లోనూ అనుసరించేందుకు రోహిత్ సేన సిద్ధమైనట్లు తెలుస్తోంది.