
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ రెండు వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడంతో పాటు 2-0తో సిరీస్‌ను కోల్పోయింది. అడిలైడ్ మైదానంలో 17 సంవత్సరాల తర్వాత భారత్ ఓడిపోవడం, అలాగే 441 రోజుల తర్వాత వరుసగా రెండు వన్డే మ్యాచ్‌లలో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో నిరాశపరిచింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వ్యూహాత్మక లోపాలు జట్టు ఓటమికి కారణమయ్యాయి.
టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. జోష్ హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అనుకున్నట్టుగానే తడబడ్డారు. కెప్టెన్ గిల్, విరాట్ కోహ్లి తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లో డక్ అవుట్ అయ్యాడు. జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను రోహిత్ శర్మ(73), శ్రేయాస్ అయ్యర్(61) మూడో వికెట్‌కు 118 పరుగుల కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అయితే వీరిద్దరూ అవుట్ కాగానే.. మళ్లీ భారత్ బ్యాటింగ్ తడబడింది. ఆడమ్ జంపా(శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి) నాలుగు కీలక వికెట్లు తీసి భారత మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44 పరుగులు) ఫర్వాలేదనిపించినా.. జట్టు ఎక్కువ స్కోర్ చేయడంలో సాయం అందించలేకపోయాడు. చివరి ఓవర్లలో హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్ మెరుపుల కారణంగా జట్టుకు 264/9 గౌరవప్రదమైన స్కోర్ దక్కింది.
ఇక 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు అర్ష్‌దీప్ సింగ్ మిచెల్ మార్ష్‌ను, హర్షిత్ రానా ట్రావిస్ హెడ్‌ను త్వరగా ఔట్ చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఒకానొక సమయంలో టీమిండియా గెలుస్తుందని అందరూ అనుకుంటే.. ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు, కెప్టెన్సీ వ్యూహాత్మక లోపాలు మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వైపు మళ్లించాయి. మ్యాట్ షార్ట్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు అక్షర్ పటేల్ ఒక క్యాచ్‌ను వదిలేయగా, అతడు అర్ధ సెంచరీ సాధించిన తర్వాత సిరాజ్ మరో క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. ఈ రెండు క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చాయి.
కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బౌలర్ల రొటేషన్‌లో, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌లో అనుభవం లేమిని ప్రదర్శించాడు. వాషింగ్టన్ సుందర్ 12వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చి మంచి ఓవర్ వేసినప్పటికీ, అతనికి తర్వాతి ఓవర్లు ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి వంటి పార్ట్‌టైమ్ బౌలర్‌కు ఓవర్ ఇవ్వడం, సుందర్‌ను కొనసాగించకపోవడం వల్ల ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తగ్గింది. అటు మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కోచ్ గంభీర్ ఎందుకు తీసుకోలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి భిన్నంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తన బౌలర్లను సమర్థవంతంగా రొటేట్ చేశాడు. ఆడమ్ జంపా, జేవియర్ బార్ట్లెట్‌లను సరైన సమయంలో ఉపయోగించి వికెట్లను సాధించాడు.
చివరి ఓవర్లలో హర్షిత్ రానా బౌలింగ్ పేలవంగా మారింది. షార్ట్ బాల్స్ వేస్తూ సులభంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీనివల్ల ఆస్ట్రేలియా రన్ రేట్ వేగంగా పెరిగింది. కూపర్ కొన్నోలీ (55), మ్యాట్ ఓవెన్(36) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. ఓవరాల్‌గా బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. ఫీల్డింగ్, కెప్టెన్సీ వ్యూహాత్మక లోపాలు భారత్‌కు ఈ మ్యాచ్‌ను, సిరీస్‌ను దూరం చేశాయి. కాగా, గంభీర్ కోచ్ అయిన తర్వాత టీమిండియా చెత్త రికార్డులు నమోదు చేస్తోందని.. 17 ఏళ్లుగా ఆ మైదానం ఓటమి ఎరగని టీమిండియాకు ఓటమిని చూపించాడని నెటిజన్లు అంటున్నారు.
Another series loss under coach Gautam Gambhir. Worst coach ever.#INDvsAUS pic.twitter.com/Qc5P6a6Zun
— Gagan🇮🇳 (@1no_aalsi_) October 23, 2025