
IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ షెడ్యూల్‌లో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ముందు కొత్త ప్రతిపాదన ఉంచడంతో మ్యాచ్ తేదీలు మారే అవకాశం ఏర్పడింది. బీసీసీఐ ఆగస్టు 12న అఫ్గానిస్థాన్‌తో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఖరారైన షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 15న, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 17న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్ విడుదలైన 24 గంటల్లోనే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మ్యాచ్ తేదీల్లో మార్పులు చేయాలని బీసీసీఐని కోరింది.
వినాయక చవితి సెంటిమెంట్
తొలి లేదా రెండో టీ20 మ్యాచ్‌ను సెప్టెంబర్ 14వ తేదీకి మార్చాలని అఫ్గానిస్థాన్ బోర్డు కోరినట్లు సమాచారం. సెప్టెంబర్ 14న దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగ ఉంది. అఫ్గాన్ విజ్ఞప్తిని బీసీసీఐ ఆమోదిస్తే టీమిండియా వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. ఒకవేళ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 14కి జరిపితే, ఆ తర్వాతి రోజే అంటే సెప్టెంబర్ 15న రెండో టీ20 జరుగుతుంది. క్రికెట్ చరిత్రలో భారత్ ఒక జట్టుకు ఆతిథ్యమిస్తున్నప్పటికీ, ఈ మ్యాచ్‌లను అఫ్గానిస్థాన్ స్వదేశీ సిరీస్‌గా పరిగణించడం విశేషం. డెహ్రాదూన్, లక్నో, గ్రేటర్ నోయిడా మైదానాలను అఫ్గాన్ జట్టుకు హోమ్ గ్రౌండ్లుగా బీసీసీఐ ఇదివరకే కేటాయించింది.
బంగ్లాదేశ్ టూర్‌పై అనుమానాల నీడలు
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఖరారు కావడంతో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన పూర్తిగా ప్రమాదంలో పడింది. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత ఏడాది ఆగస్టు నుంచి వాయిదా పడుతూ వస్తున్న బంగ్లాదేశ్ సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. సిరీస్ పునరుద్ధరణ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) బీసీసీఐని సంప్రదించినప్పటికీ భారత బోర్డు నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. భారత జట్టు రాబోయే నెలల్లో బిజీ షెడ్యూల్‌తో ఉండటం, ఇప్పుడు అఫ్గాన్ సిరీస్ ఖరారు కావడంతో బంగ్లాదేశ్ టూర్ రద్దయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..