క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ప్లేయర్‌కు నిజంగానే గాయమైందా? లేదా? అని విచారణ!

లార్డ్స్ టెస్టులో ఇమామ్-ఉల్-హక్ గాయం నిజమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు రాకపోవడంపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ విచారణకు సిద్ధమైంది. ఆకిబ్ జావేద్ ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశారు. గాయం తీవ్రత, చికిత్స విధానంపై పూర్తి వివరాలు పరిశీలించనున్నారు.

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ప్లేయర్‌కు నిజంగానే గాయమైందా? లేదా? అని విచారణ!
Imam Ul Haq Injury Probe

Updated on: Sep 02, 2026 | 4:36 PM

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో ఆ జట్టు ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ గాయంపై వివాదం మొదలైంది. మ్యాచ్ సందర్భంగా కాలి పిక్కకు గాయమైన ఇమామ్.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు రాకపోవడంపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీలోని సీనియర్ సభ్యుడు ఆకిబ్ జావేద్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విచారణ జరుపుతుందని వెల్లడించారు.

రెండు ఇన్నింగ్స్‌లకు ఎలా దూరమయ్యాడు?

పాకిస్థాన్ నాలుగు సభ్యుల సెలక్షన్ ప్యానెల్‌లో ఉన్న ఆకిబ్ జావేద్.. కండరాల గాయం కారణంగా ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గాయాలు క్రికెట్‌లో సహజమేనని, గతంలో ఆటగాళ్లు గాయాలతోనూ కట్టులు కట్టుకుని బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే ఇమామ్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

భారీ కట్టుతో కనిపించిన ఇమామ్

లార్డ్స్ టెస్టు తొలి రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇమామ్ ఎడమ కాలి పిక్కకు గాయమైంది. దీంతో మ్యాచ్‌లో మిగిలిన భాగానికి అతడు దూరమయ్యాడు. అయితే నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఇమామ్ మైదానంలోని అవుట్‌ఫీల్డ్‌లో కనిపించాడు. కాలికి భారీగా కట్టు కట్టుకుని షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన అతడు నడిచేటప్పుడు కుంటుతూ కనిపించడం చర్చకు దారితీసింది. లార్డ్స్ టెస్టు కోసం తుది జట్టు ఎంపిక విషయంలో సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలపైనా ఆకిబ్ జావేద్ స్పందించారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉబైద్ షాను జట్టులోకి తీసుకోవాలని తాను సూచించినట్లు తెలిపారు. వికెట్ కీపర్-బ్యాటర్ ఘాజీ ఘోరీకి అవకాశం ఇవ్వాలని, మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో అతడిని ఆడించాలని తాను అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే తుది జట్టు ఎంపికలో తన సూచనలు పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు.

మూడో టెస్టుకు కొత్త కోచ్‌లు

హెడ్డింగ్లీ, లార్డ్స్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్ ఓటమి తర్వాత జట్టు ప్రక్షాళన చేపట్టింది. ఏడుగురు ఆటగాళ్లను తిరిగి స్వదేశానికి పంపగా, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను కూడా వెనక్కి పిలిచింది. సెప్టెంబర్ 9న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టు కోసం వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెసన్, బౌలింగ్ కోచ్ ఆష్లే నాఫ్కేలకు బాధ్యతలు అప్పగించింది. ఇమామ్ గాయం వ్యవహారంపై విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us