
భారత టెస్టు జట్టు కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు, భారత్ జట్టులో పెద్దమార్పులు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో సీనియర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తన టెస్ట్ పునరాగమనం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్లు నన్ను తీసుకుంటారా లేదా నాకు తెలియదు. కానీ అవకాశం వస్తే, దేశానికి మళ్లీ ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉంటుంది” అని పుజారా చెప్పడం, అతను తన టెస్టు కెరీర్‌పై గట్టి ఆశలతో ఉన్నాడని స్పష్టంగా చూపుతోంది.
ఇటీవల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి కీలక ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో భారత జట్టు నూతన యుగంలోకి అడుగుపెట్టింది. ఈ పునర్నిర్మాణ దశలో యువ ఆటగాళ్లతో పాటు పుజారా, అజింక్య రహానే లాంటి అనుభవజ్ఞుల సలహాలు, మార్గదర్శనం కూడా కీలక పాత్ర పోషించవచ్చు. ఈ నేపధ్యంలో పుజారాకు టీం ఇండియా టెస్ట్ కోచ్ గౌతం గంభీర్ ఫోన్ చేశాడా? అనే ప్రశ్నకు సమాధానంగా “ఇంకా లేదు” అని నవ్వుతూ చెబుతూనే తన ఆసక్తిని మాత్రం పరవశంగా పంచుకున్నాడు.
చతేశ్వర్ పుజారా భారత్ తరఫున 103 టెస్టులు ఆడి 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో భారత్ ఓడిన తర్వాత అతను జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అయినప్పటికీ, దేశీ క్రికెట్‌లో పుజారా తన ఫామ్‌ను కొనసాగిస్తూ, తనను మళ్ళీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాడు.
పుజారా వ్యాఖ్యల్ని బట్టి అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, దేశానికి మళ్లీ ప్రాతినిధ్యం వహించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడని అర్థమవుతుంది. “మీరు ఫిట్‌గా ఉన్నంత కాలం, మంచి ప్రదర్శన ఇస్తున్నంత కాలం, జట్టులో ఉండాలనేది సహజమైన ఆకాంక్ష” అని పుజారా అన్నారు. జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమయ్యే సిరీస్‌తో భారత జట్టు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో కొత్త యుగాన్ని ఆరంభించనుంది. ఈ నేపధ్యంలో, పుజారా తిరిగి జట్టులోకి వస్తాడా? అనే ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. కానీ పుజారా ఇప్పటికీ తన టెస్ట్ కెరీర్‌ను పూర్తి చేయలేదని, భారత్ తరపున మళ్లీ ఆడాలని గట్టి సంకల్పంతో ఉన్నాడనే సంగతి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..