లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదు రోజుల పాటు హైవోల్టేజ్ థ్రిల్లర్‌ను తలపించిన ఈ మ్యాచ్‌లో ఆటతో పాటు అగ్రెషన్‌లోనూ టీమిండియా పైచేయి సాధించింది. అసలే టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్.. జట్టులోని సభ్యులు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కవ్వింపులకు ఇప్పటి టీమిండియా జట్టు ఖచ్చితంగా ఘాటుగా జవాబిస్తుంది.
”మాలో ఒకరిని మీరు కవ్విస్తే.. మేం 11 మంది తిరగపడతాం” మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తీసుకున్న తర్వాత టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు. టెస్టు మొదలైన నాటి నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాటలు తూటాల మాదిరిగా పేలాయి. మొదట ఇంగ్లీష్ ఆటగాళ్లు జస్ప్రిత్ బుమ్రాను లక్ష్యంగా ఎంచుకోగా.. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మళ్లీ కోహ్లీ-రాబిన్‌సన్, అండర్సన్-బుమ్రా.. ఇలా ఈ మ్యాచ్ హైవోల్టేజ్‌గా సాగింది.
ఇంగ్లీష్ క్రికెటర్లు జస్ప్రిత్ బుమ్రాను టార్గెట్ చేయడంతో మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కెఎల్ రాహుల్ స్పందించాడు. ”కవ్వింపులకు తాము ఎప్పుడూ భయపడమని.. ఘాటుగా స్పందిస్తాం” అని అన్నాడు. ”రెండు గొప్ప జట్లు తలపడితే ఇలాగే ఉంటుంది. మా పోరాటం గురించి చెప్పడానికి మాటలు లేవు. గెలుపు కోసం రెండు జట్లు తీవ్రంగా కృషి చేశాయి. కవ్వింపులకు మేము ఎప్పుడూ భయపడం. మాలో ఒకరిని కవ్విస్తే.. 11 మంది తిరగపడతాం” అని రాహుల్ స్పష్టం చేశాడు.
”ఆ కవ్వింపులే మా జట్టును గెలిపించాయి. మా బౌలర్లలో కసిని పెంచాయి. వారెంతో నిరూపించుకున్నారు. లార్డ్స్ ఆనర్ బోర్డులో నా పేరును ఎప్పుడు శాశ్వతంగా చెక్కుతారా అని ఆత్రుత చెందాను. జట్టు గెలుపుకు నా శతకం ఉపయోగపడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది” అని రాహుల్ పేర్కొన్నాడు. కాగా, రాహుల్ వ్యాఖ్యలు టీమిండియా ఆటతీరు, దూకుడుతనాన్ని ప్రతిబింబిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.