
యాషెస్ సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఓటమితో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్( WTC) 2025-27 సైకిల్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 14 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో మొదటి టెస్ట్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. దీని ఫలితంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగలగా.. ఇంగ్లాండ్ పెద్దగా లభాపడలేదు.
ఈ విజయంతో ఇంగ్లాండ్ పాయింట్ల శాతం 27.08 నుంచి 35.19కి పెరిగింది. ఇంత శాతం పెరిగినా ఆ జట్టు ఇంకా ఏడో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింట మాత్రమే గెలిచింది ఇంగ్లాండ్. ఐదు మ్యాచ్‌లు ఓడిపోయి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ సైకిల్‌లో తొలి ఓటమిని చవిచూసింది. మొదటి ఆరు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత 100 పర్సెంట్‌తో ఉన్న కంగారూలు.. ఇప్పుడు 85.71 శాతంతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ 77.78 పాయింట్ల శాతంతో రెండవ స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో మూడో స్థానంలో ఉంది. శ్రీలంక 66.67 పాయింట్ల శాతంతో నాలుగో స్థానంలో.. పాకిస్తాన్ 50 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉంది . టీమిండియా 48.15 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, నాలుగు గెలిచి, నాలుగు ఓడి, ఒక మ్యాచ్ డ్రాగా ముగించుకుంది. అలాగే టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ల్లో దాదాపుగా అన్ని గెలిస్తేనే.. ఫైనల్ చేరుతుంది. అది అసాధ్యమంటున్నారు క్రికెట్ నిపుణులు.
మెల్‌బోర్న్ పిచ్‌పై లోస్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 175 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ పిచ్‌పై వికెట్లు త్వరతగిన పడ్డాయి. అయితే నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బలమైన పునరాగమనం చేయడంతో అద్భుత విజయాన్ని అందుకుంది.