మహిళల ప్రపంచకప్ 2022(Womens World Cup 2022) 17వ మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. కేవలం 140 పరుగులు చేసినప్పటికీ, వెస్టిండీస్ చివరి ఓవర్‌లో బంగ్లాదేశ్ (Bangladesh Women vs West Indies Women) ను ఆలౌట్ చేయడం ద్వారా విజయం సాధించింది. చివరి ఓవర్‌లో బంగ్లాదేశ్ విజయానికి 8 పరుగులు అవసరం కాగా, స్టెఫానీ టేలర్ తన మూడో బంతికి ఫరీహా తృష్ణను బౌల్డ్ చేసి జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించింది. బంగ్లాదేశ్ జట్టు 136 పరుగులకే కుప్పకూలింది. 10 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన హేలీ మాథ్యూస్(Hayley Matthews) వెస్టిండీస్ విజయంలో హీరోయిన్‌గా మారింది. ఆమె కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆమెకి తోడు కెప్టెన్ స్టెఫానీ టేలర్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అమీ ఫ్లెచర్ 3 వికెట్లు తీసింది.
వెస్టిండీస్ తరపున షిమనే క్యాంప్‌బెల్ అత్యధికంగా 53 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ 18, డియాండ్రా డాటిన్ 17 పరుగులు చేశారు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఎఫీ ఫ్లెచర్ కూడా 17 పరుగుల సహకారం అందించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సల్మా ఖాతూన్, నహిదా అక్తర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రుమానా అహ్మద్, రీతూ మోని, జహనారా ఆలమ్ చెరో వికెట్ తీశారు.
బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఫ్లాప్..
కేవలం 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభం బాగా లేదు. వికెట్ కీపర్ షమీమా సుల్తానా జీరోకే పెవిలియన్ చేరింది. షర్మీన్ అక్తర్, ఫర్గానా హక్ మంచి భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. కానీ హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. కెప్టెన్ నిగర్ సుల్తానా 77 బంతులపాటు క్రీజులో గడిపినప్పటికీ.. ఆమె కూడా హేలీ మాథ్యూస్‌కు బలైంది. ఫర్గానా హక్ కూడా కేవలం 23 పరుగులకే ఔటైంది.
బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు సున్నాకి వెనుదిరగడంతో ఎదురుదెబ్బ తగిలింది. ఎఫీ ఫ్లెచర్ మొదట రుమానా అహ్మద్‌ను, ఆ తర్వాత రీతు మోనిని అవుట్ చేయడంతో.. బంగ్లాదేశ్ 60 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. సల్మా ఖాతూన్ 40 బంతుల్లో 23 పరుగులు చేసింది. ఫహిమా ఖాతూన్ 64 బంతుల్లో 25 పరుగులు చేసింది. ఫహిమా ఖాతూన్ 0 పరుగులకే ఔటైంది. నహిదా అక్తర్ చివరి వరకు క్రీజులో కొనసాగినప్పటికీ 25 పరుగులు మాత్రమే చేసి జట్టును గెలిపించలేకపోయింది.
పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన వెస్టిండీస్..
మహిళల ప్రపంచ కప్ 2022లో మూడో విజయం సాధించి, వెస్టిండీస్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. వెస్టిండీస్ 6 పాయింట్లతో భారత్‌ను అధిగమించింది. 4 మ్యాచ్‌లు ఆడి చెరో 4 పాయింట్లతో నిలిచిన ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉన్నాయి.