AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20I Rankings : టీ20 క్రికెట్‌లో మనోళ్ల హవా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీళ్లే

ICC T20I Rankings : ఐసీసీ టీ 20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ లో ఇషాన్ కిషన్ ప్రపంచ నంబర్-1గా అవతరించాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

ICC T20I Rankings : టీ20 క్రికెట్‌లో మనోళ్ల హవా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీళ్లే
Icc T20i Rankings
Rakesh
|

Updated on: Jul 03, 2026 | 9:40 AM

Share

ICC T20I Rankings : ఐసీసీ ప్రతి వారం విడుదల చేసే వన్డే, టెస్ట్, టీ20 ప్లేయర్ల ర్యాంకింగ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. మైదానంలో నిలకడగా రాణిస్తూ అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లను ఈ ర్యాంకింగ్స్ ద్వారా ఐసీసీ నంబర్ 1 స్థానంతో గౌరవిస్తుంది. క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మాట్‌లో భారత బ్యాటర్లు ఎప్పుడూ పైచేయి సాధిస్తూనే వచ్చారు. అయితే ఎంతో మంది దిగ్గజాలు ఈ ఫార్మాట్‌లో ఆడినప్పటికీ.. ఐసీసీ మెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు కేవలం నలుగురంటే నలుగురు భారత ఆటగాళ్లు మాత్రమే నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోగలిగారు. విరాట్ కోహ్లీతో మొదలైన ఈ ప్రస్థానం.. తాజాగా ఇషాన్ కిషన్ వరకు చేరింది.

కింగ్ కోహ్లీ అల్టిమేట్ రికార్డ్

భారత రన్ మెషిన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 2015వ సంవత్సరంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను వెనక్కి నెట్టి కోహ్లీ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రపంచ క్రికెట్‌లో ఏ బ్యాటర్‌కు సాధ్యంకాని విధంగా ఏకంగా 1,202 రోజుల పాటు కోహ్లీ నంబర్ 1 స్థానంలోనే కొనసాగాడు. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన కెరీర్ బెస్ట్‌గా 909 రేటింగ్ పాయింట్లను సాధించాడు. ఎంతటి కష్టసాధ్యమైన లక్ష్యాలనైనా చేధించే కోహ్లీ అద్భుతమైన ఆటతీరు ఆయనను టీ20 చరిత్రలోనే అత్యంత గొప్ప బ్యాటర్‌గా నిలబెట్టింది.

మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం

కోహ్లీ తర్వాత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ శిఖరాన్ని అధిరోహించిన రెండో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. మైదానం నలుమూలలా షాట్లు కొట్టే సత్తా ఉన్న సూర్యకుమార్‌ను అభిమానులు భారతదేశపు 360-డిగ్రీ బ్యాటర్ అని పిలుచుకుంటారు. భయం ఎరుగని హిట్టింగ్‌తో సరికొత్త బ్యాటింగ్ శైలిని పరిచయం చేసిన సూర్య, 2022 నవంబర్ 2న పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను దాటేసి నంబర్ 1 స్థానానికి దూసుకెళ్లాడు. ఆ తర్వాత 2022, 2023, 2024 సంవత్సరాల్లో సూర్యకుమార్ మెజారిటీ కాలం నంబర్ 1 స్థానంలోనే రాజ్యమేలాడు. అంతేకాదు, టీ20 ర్యాంకింగ్స్‌లో ఏ భారతీయ బ్యాటర్ సాధించని విధంగా కెరీర్ బెస్ట్‌గా 912 రేటింగ్ పాయింట్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించిన అభిషేక్ శర్మ

భారత యువ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ జాబితాలో మూడో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన బ్యాటింగ్‌తో వెలుగులోకి వచ్చిన అభిషేక్, చాలా త్వరగానే టీ20 జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో వరుసగా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ యంగ్ స్టార్.. 2025 జూలై 30న ఆస్ట్రేలియా పవర్‌ఫుల్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను అధిగమించి ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాడు. ఆ తర్వాత సుమారు 12 నెలల (ఒక సంవత్సరం) పాటు నంబర్ 1 స్థానంలోనే కొనసాగుతూ, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్‌గా తన ముద్ర వేశాడు.

హిస్టరీ క్రియేట్ చేసిన ఇషాన్ కిషన్

కాగా, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 సింహాసనాన్ని అధిరోహించిన తాజా భారతీయ ప్లేయర్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నిలిచాడు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన ఇషాన్, తనదైన దూకుడుతో తుఫాన్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ మూడోసారి ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 9 ఇన్నింగ్స్‌ల్లో 193.29 అద్భుత స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 317 రన్స్ చేసి దుమ్ములేపాడు. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్‌లో జరిగిన సిరీస్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ, అంతకుముందు వరల్డ్ కప్‌లో ఇషాన్ చేసిన పరుగుల పుణ్యమా అని ఆయన 876 రేటింగ్ పాయింట్లతో కెరీర్ బెస్ట్ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో అభిషేక్ శర్మ కొద్దిగా ఫామ్ కోల్పోవడంతో, అతడిని వెనక్కి నెట్టి ఇషాన్ కిషన్ ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ కిరీటాన్ని దక్కించుకున్నాడు.

Follow Us