
ICC Rankings 2026: ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టెస్టుల్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, మరో విజయం సాధిస్తే మూడో స్థానానికి చేరే అవకాశం స్పష్టంగా ఉంది. పాకిస్థాన్ జట్టు విషయానికొస్తే వన్డేల్లో మాత్రమే ఐదో స్థానంలో నిలిచి టాప్-5లో చోటు దక్కించుకుంది. టెస్టుల్లో ఎనిమిదో స్థానానికి పడిపోగా, టీ20ల్లో ఆరో స్థానానికి పరిమితమైంది.
బ్యాటింగ్ విభాగంలో భారత్ హవా
వ్యక్తిగత బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. వన్డేల్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మొదటి స్థానంలో నిలవగా, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో యువ కిరటం ఇషాన్ కిషన్ అగ్రపీఠాన్ని కైవసం చేసుకోగా, అభిషేక్ శర్మ మూడో స్థానంలో, తిలక్ వర్మ ఆరో స్థానంలో నిలిచారు. టెస్టుల్లో రిషభ్ పంత్ ఏడో స్థానంలో, శుభ్ మన్ గిల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ నుంచి కేవలం బాబర్ ఆజమ్ మాత్రమే టెస్టుల్లో 10వ ర్యాంక్, వన్డేల్లో 6వ ర్యాంక్‌లో స్థానం సంపాదించుకున్నాడు.
బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో మనోళ్ల హవా
బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లోనూ భారత్ అత్యంత బలంగా కనిపిస్తోంది. టెస్టు బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతుండగా, టీ20ల్లో వరుణ్ చక్రవర్తి ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో, వాషింగ్టన్ సుందర్ ఆరో స్థానంలో నిలిచి సత్తా చాటారు. టీ20 ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లలో నోమాన్ అలీ టెస్టుల్లో 8వ ర్యాంక్, అబ్రార్ అహ్మద్ వన్డే, టీ20ల్లో రెండో స్థానంలో నిలిచారు.
పాకిస్థాన్ జట్టులో సంక్షోభం
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. జట్టు నుంచి ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను తొలగించడంతో పాటు హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌లను కూడా పదవుల నుంచి తప్పించింది. ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే కిందకు పడిపోవడంతో పాక్ జట్టుపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు ఫార్మాట్లలోనూ స్థిరమైన ప్రదర్శన చేస్తూ టీమిండియా జగజ్జేతగా ముందుకు సాగుతోంది. పదే పదే మార్పులు చేస్తూ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి పుంజుకోవాలంటే ఆటతీరును పూర్తిగా మార్చుకోవాల్సిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..