T20 World Cup 2026 : బంగ్లాదేశ్ తప్పుకుంది..పాకిస్థాన్ కూడా బ్యాగ్ సర్దేస్తోందా? వరల్డ్ కప్ లో అసలేం జరుగుతోంది?

T20 World Cup 2026 : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ నజం సేథీ మరోసారి తన నోటికి పని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ మండలిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో పెను దుమారం రేపుతున్నాయి. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు, అది ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఐసీసీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక బీసీసీఐ హస్తం ఉంటుందని ఆయన విషం చిమ్మారు.

T20 World Cup 2026 : బంగ్లాదేశ్ తప్పుకుంది..పాకిస్థాన్ కూడా బ్యాగ్ సర్దేస్తోందా? వరల్డ్ కప్ లో అసలేం జరుగుతోంది?
Najam Sethi Comments

Updated on: Jan 25, 2026 | 7:40 AM

T20 World Cup 2026 : అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రికెట్ మైదానాన్ని దాటి ఐసీసీ ఆఫీసు వరకు వెళ్లాయి. టీ20 వరల్డ్ కప్ 2026 నిర్వహణ విషయంలో ఐసీసీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు పాక్ మాజీ క్రికెట్ చీఫ్ నజం సేథీకి అస్సలు నచ్చలేదు. బంగ్లాదేశ్ జట్టు ఈ మెగా టోర్నీని బహిష్కరించడం, ఆ ప్లేస్‌లో స్కాట్లాండ్‌ను ఐసీసీ సెలక్ట్ చేయడం వెనుక బీసీసీఐ ఒత్తిడి కచ్చితంగా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఐసీసీ స్వతంత్రంగా పనిచేయడం లేదని, భారత్ చెప్పినట్లు నడుస్తుందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి ఐసీసీలో అత్యధిక ఆదాయం, పలుకుబడి ఉందన్నది జగమెరిగిన సత్యం. అయితే దీనిని నజం సేథీ నెగటివ్ కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఐసీసీకి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగం భారత్ నుంచే వస్తుందన్న నిజాన్ని మర్చిపోయి, ఐసీసీ తన ఉనికిని కోల్పోయిందని ఆయన విమర్శించారు. “ఒకవేళ పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాలు ఏకమైతే, అప్పుడు ఐసీసీకి అసలు విషయం అర్థమవుతుంది. ఇది ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది” అని ఆయన టెలికామ్ ఆసియా స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్థాన్ కూడా ఈ టోర్నీని బహిష్కరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పీసీబీ చైర్మన్‌గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ఇప్పటికే ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు. పాక్ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అనుమతి ఇస్తేనే తమ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఐసీసీ తన నిబంధనలను భారత్‌కు అనుకూలంగా మార్చుకుంటోందని, ఇది ఇతర దేశాల క్రికెట్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని పాక్ వాదిస్తోంది.

నజం సేథీ గతంలో కూడా భారత్‌కు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ నిర్వహణ సమయంలో కూడా ఆయన హైబ్రిడ్ మోడల్ పేరుతో బీసీసీఐని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఇప్పుడు వరల్డ్ కప్ వేళ బంగ్లాదేశ్‌ను అడ్డం పెట్టుకుని ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అని పిలవడం ద్వారా ప్రపంచ క్రికెట్‌లో భారత్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. అయితే, ఐసీసీ మాత్రం ఈ విమర్శలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ పాక్ నిజంగానే వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే, అది ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుకే గొడ్డలి పెట్టు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి మైదానంలో ఆట కంటే బయట జరుగుతున్న ఈ మాటల యుద్ధం క్రికెట్ అభిమానులను అయోమయంలో పడేస్తోంది. భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందా లేక పాక్ విమర్శలకు సమాధానం ఇస్తుందా అన్నది వేచి చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..