
Lionel Messi : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రస్తుతం తన GOAT టూర్‌లో భాగంగా భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన కలకత్తా, హైదరాబాద్, ముంబై నగరాలను సందర్శించారు. ఈ టూర్‌లో మూడవ, చివరి రోజున ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో, ఐసీసీ ఛైర్మన్ జై షా మెస్సీని కలిశారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ టికెట్‌ను జై షా మెస్సీకి బహూకరించడం విశేషం.
మెస్సీకి టీ20 వరల్డ్ కప్ టికెట్
ఐసీసీ ఛైర్మన్ జై షా మెస్సీకి భారత్, యూఎస్‌ఏ మధ్య జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్‌ను ప్రత్యేకంగా అందించారు. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 7వ తేదీన జరగనుంది. తద్వారా మెస్సీ ఈ మ్యాచ్ చూడటానికి తిరిగి భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో జై షా, మెస్సీకి భారత టీ20 వరల్డ్ కప్ జెర్సీని కూడా బహుకరించారు. ఈ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు, మెస్సీ సహచర ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా అక్కడే ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.
Jay Shah supremacy 🫡
Bro invited Messi to watch a cricket match 💀 pic.twitter.com/kepTJR5iU1— xuraj (@xurajbxnl) December 15, 2025
ఢిల్లీలో మెస్సీ సందడి
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మెస్సీ, సువారెజ్, డి పాల్‌తో కలిసి పిల్లలతో ఫుట్‌బాల్ ఆడారు. ఆ తర్వాత అక్కడ ఒక ప్రదర్శన మ్యాచ్ కూడా జరిగింది. మినిర్వా మెస్సీ ఆల్‌స్టార్స్ టీమ్, సెలబ్రిటీ మెస్సీ ఆల్‌స్టార్స్ టీమ్‌పై 6-0 తేడాతో విజయం సాధించింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దాదాపు 22,000 మంది ప్రేక్షకులు మైదానంలో హాజరయ్యారు. వారంతా మెస్సీ, మెస్సీ అని నినాదాలు చేశారు. మెస్సీ, సువారెజ్, డి పాల్ మైదానం చుట్టూ తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. బాల్స్‌ను ప్రేక్షకుల వైపు విసిరి మరింత ఉత్సాహపరిచారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..