RCB: ఆర్‌సీబీ పేసర్‌పై మరో కేసు నమోదు.. మైనర్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు..

ఒకే క్రికెటర్ పై రెండు వేర్వేరు నగరాల్లో, వేర్వేరు మహిళల ద్వారా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యశ్ దయాల్‌కు ఇది రెండవ వేధింపుల కేసు కావడంతో, ఈ వ్యవహారం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

RCB: ఆర్‌సీబీ పేసర్‌పై మరో కేసు నమోదు.. మైనర్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు..
Yash Dayal

Updated on: Jul 25, 2025 | 9:35 PM

క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న మరో పరిణామం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌పై రెండో మానసిక వేధింపుల కేసు నమోదైంది. గతంలో ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ అతడిపై వేధింపులు, లైంగిక దోపిడీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జైపూర్‌కు చెందిన మరో మహిళ అతడిపై లైంగిక దాడి ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపుతోంది.

మొదటి కేసు: గతంలో ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళ యశ్ దయాల్‌పై ఐదేళ్లపాటు సంబంధంలో ఉన్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించాడని ఆరోపించింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద అతనిపై కేసు నమోదైంది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అతని అరెస్ట్‌పై స్టే విధించింది. దయాల్ కూడా ఆ మహిళ తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని, ఆమె ఆరోపణలు అవాస్తవమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాజా కేసు: జైపూర్‌కు చెందిన మహిళ చేసిన ఫిర్యాదు ప్రకారం, యశ్ దయాల్ తనను రెండేళ్లపాటు లైంగికంగా వేధించాడని, భావోద్వేగంగా బ్లాక్‌మెయిల్ చేశాడని, క్రికెట్ కెరీర్‌లో సహాయం చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చాడని ఆరోపించింది. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు, 17 సంవత్సరాల వయసులో, జైపూర్‌లో జరిగిన ఒక IPL మ్యాచ్ సందర్భంగా దయాల్‌ను కలిసినట్లు పేర్కొంది. దయాల్ తనను కెరీర్ సలహా పేరుతో సీతాపురాలోని ఒక హోటల్‌కు ఆహ్వానించాడని, అక్కడే మొదటి లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసింది. ఈ వేధింపులు రెండేళ్లపాటు కొనసాగాయని, ఆమె మైనర్‌గా ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయని పేర్కొనడంతో పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఒకే క్రికెటర్ పై రెండు వేర్వేరు నగరాల్లో, వేర్వేరు మహిళల ద్వారా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యశ్ దయాల్‌కు ఇది రెండవ వేధింపుల కేసు కావడంతో, ఈ వ్యవహారం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రికెట్ బోర్డు, అతని ఫ్రాంచైజీ RCB ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. కేసుల దర్యాప్తు కొనసాగుతోంది, పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..