
Border-Gavaskar Trophy :భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎల్లప్పుడూ టెస్ట్ క్రికెట్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన, ప్రతిష్టాత్మకమైన సిరీస్‌గా పరిగణించబడుతుంది. ఈ పోటీ వేదికపై బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడం పెద్ద సవాలుతో కూడుకున్నది. అయినప్పటికీ చరిత్ర సృష్టించేందుకు గొప్ప అవకాశం లభిస్తుంది. ఈ ట్రోఫీలో కొందరు దిగ్గజాలు అసాధారణమైన రికార్డులను నెలకొల్పారు. వాటిని ఇప్పటికీ బ్రేక్ చేయడం కష్టంగా ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌ల జాబితా ఇక్కడ ఉంది.
1. సచిన్ టెండూల్కర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. 1996 నుంచి 2013 వరకు ఈ ట్రోఫీలో తన అద్భుతమైన ప్రదర్శనతో, సచిన్ 34 మ్యాచ్‌ల 65 ఇన్నింగ్స్‌లలో మొత్తం 3262 పరుగులు సాధించారు. ఆయన సగటు 56.24గా ఉంది. ఇందులో 9 అద్భుతమైన సెంచరీలు ఉన్నాయి. 2004లో సిడ్నీ టెస్టులో నాటౌట్‌గా చేసిన 241 పరుగుల ఇన్నింగ్స్ ఆయన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రికార్డులలో ఒక మైలురాయిగా నిలిచింది.
2. రికీ పాయింటింగ్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాయింటింగ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 29 మ్యాచ్‌లు ఆడిన పాయింటింగ్ మొత్తం 2555 పరుగులు చేశారు. భారత్ బౌలింగ్‌పై ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని చూపిన పాయింటింగ్, ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీలో 8 సెంచరీలను నమోదు చేశారు. పరుగులు చేసిన మొత్తం సంఖ్యలో సచిన్ కంటే వెనుకబడి ఉన్నా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై పాయింటింగ్ ప్రభావం చాలా బలంగా ఉంది.
3. వీవీఎస్ లక్ష్మణ్
భారత క్రికెట్‌లో క్రైసిస్ మ్యాన్ గా పేరుగాంచిన వీవీఎస్ లక్ష్మణ్ మూడో స్థానంలో ఉన్నారు. 54 ఇన్నింగ్స్‌లలో మొత్తం 2434 పరుగులు చేసిన లక్ష్మణ్ రికార్డులు ఆయన నైపుణ్యాన్ని, క్లాసిక్ బ్యాటింగ్‌ను సూచిస్తాయి. ముఖ్యంగా 2001లో కోల్‌కతా టెస్ట్‌లో ఆయన ఆడిన 281 పరుగుల అసాధారణమైన ఇన్నింగ్స్ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శనలలో ఒకటిగా నిలుస్తుంది.
4. స్టీవ్ స్మిత్
ప్రస్తుత తరంలో అత్యంత విజయవంతమైన టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నారు. స్మిత్ కేవలం 23 మ్యాచ్‌లలోనే 2201 పరుగులు సాధించారు. ఆయన సగటు 57.92గా ఉండటం విశేషం. ఈ స్వల్ప మ్యాచ్‌లలోనే ఏకంగా 10 సెంచరీలు నమోదు చేశారు. ఆయన అత్యధిక స్కోరు 192. ఈ అద్భుత గణాంకాలు భారత బౌలర్లకు ఆయన ఎంత ప్రమాదకారిగా ఉన్నారో స్పష్టం చేస్తున్నాయి.
5. విరాట్ కోహ్లీ
భారత టెస్ట్ క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. 51 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన కోహ్లీ మొత్తం 2169 పరుగులు చేశారు. కోహ్లీ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీలో 9 సెంచరీలను నమోదు చేశారు. ఆయన దూకుడుగా ఉండే విధానం, పెద్ద సవాళ్లను స్వీకరించడానికి ఉన్న ఆసక్తి, నిబద్ధత ఆయనను ఈ ప్రత్యేక జాబితాలో పటిష్టంగా నిలబెట్టాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..