ఫిక్సింగ్ రాయుళ్లు.. బెట్టింగ్ రాయుళ్లు రూటు మార్చారా.. తమ దందాను కొత్త మార్గంలో నడిపిస్తున్నారా… అవుననే అంటున్నారు కొందరు మాజీ క్రికెటర్లు. ప్రపంచ ఆర్థిక రంగంలో సంచలనాలు క్రియేట్ చేస్తున్న క్రిప్టో కరెన్సీని వారు ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ముఖ్యమంగా క్రిప్టో క్వీన్ బిట్ కాయిన్ కేంద్రంగా వీరు వ్యవహారం నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అంతా ఈ హవాలా లావాదేవీలు జరిపినట్లు జింబాబ్వే మాజీ కెప్టెన్ హీట్ స్ట్రీక్ ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో బుకీలు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‌ను వాడుకుంటున్నారనే సంచలనాన్ని బయట పెట్టాడు. దీన్ని ఎదుర్కోవడం తమకు ఛాలెంజ్ అని ఐసీసీ ఇంటిగ్రిటీ హెడ్ అలెక్స్ మార్షల్ పేర్కొన్నారు.
జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతోపాటు ఐపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ల్లో తన కోచింగ్ స్టింట్స్ విషయాన్ని ఒక ఇండియన్ బుకికి వెల్లడించినట్లు స్ట్రీక్ చెప్పుకొచ్చారు. దీంతో ఆయనపై ఐసీసీ ఎనిమిదేండ్ల నిషేధం విధించింది.
ఇప్పటివరకు మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడిన వారికి బుకీలు క్యాష్, కార్లు, ఆభరణాలు, హై ఎండ్ ఫోన్లను గిఫ్ట్‌లుగా బహుకరించేవారు. ఇప్పుడు బిట్ కాయిన్లను చెల్లిస్తున్నారు. స్ట్రీక్ చేసిన వ్యాఖ్యతో ఈ కొత్త దందా బయటకొచ్చింది. 2018లో అప్పటి విలువ ప్రకారం స్ట్రీక్ రెండు బిట్ కాయిన్లు తీసుకున్నారు. మొత్తం వాటి విలువ 35 వేల డాలర్లు.
మ్యాచ్ ఫిక్సింగ్‌లో బిట్ కాయిన్ రూపంలో దందా నడవడం ఆందోళన కలిగించే సంగతి అని అన్నారు. అయితే, దీన్ని దర్యాప్తు చేసి కూపీ లాగే వ్యవస్థ తమ సిబ్బందికి ఉందన్నారు.
బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ నూతన అధినేత షబ్బీర్ హుస్సేన్ షేఖాదాం ఖండ్‌వవాలా స్పందిస్తూ.. బిట్ కాయిన్ రూపంలో హావాలా లావాదేవీలు జరుగుతున్నాయని వినడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. హీత్ స్ట్రీక్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నారు. అయితే, అవినీతి పరులు తమ లావాదేవీలపై అలర్ట్‌గా ఉండబోరన్నారు.