
Shivam Dube : ఆల్‌రౌండర్ శివమ్ దూబే తాను హార్దిక్ పాండ్యాతో తనను పోల్చుకోవడం సరికాదని చెప్పాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ తనకు అన్నయ్య లాంటివాడని, అతడి నుంచి నిరంతరం నేర్చుకుంటున్నానని తెలిపాడు. బుధవారం, సెప్టెంబర్ 10న దుబాయ్‌లో యూఏఈకి వ్యతిరేకంగా జరిగిన ఆసియా కప్ 2025 గ్రూప్ ఎ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ తర్వాత దూబే మీడియాతో మాట్లాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ కేవలం నాలుగు పరుగులకు మూడు వికెట్లు తీశాడు. దీంతో భారత జట్టు కేవలం 13.1 ఓవర్లలో యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేసింది.
దూబే అద్భుత ప్రదర్శన
భారత జట్టు ఇద్దరు మీడియం-పేస్ ఆల్‌రౌండర్లను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంచింది. జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. మిగిలిన బౌలింగ్‌కు శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా ఉన్నారు. శివమ్ దూబే కేవలం రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. దూబే మాట్లాడుతూ, “హార్దిక్ నుండి నేను నేర్చుకుంటూ ఉంటాను. అతను నాకు అన్నయ్య లాంటివాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌లో అతని అనుభవం చాలా ఎక్కువ. అతని నుండి నేను ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవాలని అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ నన్ను అతనితో పోల్చుకోవాలనుకోలేదు” అని చెప్పాడు.
దూబే, హార్దిక్ ఇద్దరూ పేస్-బౌలింగ్ ఆల్‌రౌండర్లు. అయితే, భారత జట్టు వారిని వేర్వేరు పాత్రల కోసం ఉపయోగిస్తోంది. ఇద్దరూ 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో ఉన్నారు. హార్దిక్ టీమిండియా లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్‌లో ఒక ముఖ్య ఆటగాడిగా స్థిరపడ్డాడు. కానీ, దూబే ఇంకా తనకి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు.
దూబేకు అండగా గంభీర్, సూర్యకుమార్
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దూబే ఏడు మ్యాచ్‌లలో బౌలింగ్ చేసి ఎనిమిది వికెట్లు తీశాడు. గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ఇచ్చిన ప్రోత్సాహం గురించి గుర్తు చేసుకుంటూ దూబే.. “కెప్టెన్, కోచ్ నాకు బౌలింగ్ చేస్తానని ముందే చెప్పారు. మాకు నీపై నమ్మకం ఉందని వారు అన్నారు. నా బౌలింగ్ కోచ్ నాకు చాలా విషయాల్లో సహాయం చేశారు. అవకాశం వచ్చినప్పుడు బౌలింగ్ చేసేందుకు నేను రెడీ అవుతున్నాను. ఈ రోజు నా ప్రదర్శన దాని రిజల్ట్” అని అన్నాడు.
మోర్కెల్‌తో తన సంభాషణల గురించి దూబే చెబుతూ.. “ఇంగ్లాండ్ సిరీస్‌లో, అతను నాకు కొన్ని ముఖ్యమైన చిట్కాలను అందించాడు. అతను క్రీజ్‌ను ఉపయోగించుకుని, స్టంప్స్‌కు దూరంగా బౌలింగ్ చేయమని చెప్పాడు. అతను నా స్లో బంతులను మెరుగుపరుచుకోవడానికి సలహా ఇచ్చాడు. నేను చాలా కాలం నుండి దానిపై వర్క్ చేస్తున్నాను. అతను నా రన్-అప్‌ను కూడా అడ్జస్ట్ చేయడానికి సహాయం చేశాడు. ఈ మార్పుల వల్ల నేను బాగా బౌలింగ్ చేయగలుగుతున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు.
యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తెలివిగా దూబేకు బౌలింగ్ అవకాశం ఇచ్చాడు. ఇది రాబోయే కఠినమైన మ్యాచ్‌లకు సిద్ధం కావడానికి భారత్‌కు సహాయపడింది. దూబే ప్రదర్శన జట్టు మేనేజ్‌మెంట్‌కు బౌలింగ్ కాంబినేషన్‌లో మరింత సౌలభ్యం ఇచ్చింది. ఆదివారం (సెప్టెంబర్ 14)న భారత జట్టు తన దాయాది పాకిస్తాన్‌తో దుబాయ్‌లో తలపడనుంది. ఈ హై-ఓక్టేన్ మ్యాచ్‌లో కూడా దూబే తన ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.