Sehwag Coments : ఇండియన్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఇటీవల ఓ సంస్థకు సంబంధించిన యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. అందులో భాగంగా డైలాగ్ చెబుతూ.. ‘‘ఇందిరానగర్ గూండాను నేను’’ అంటూ బ్యాట్ పట్టుకొని కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అయితే నిజానికి రాహుల్ ద్రావిడ్ స్వభావం అది కాదు. అతడొక మిస్టర్ కూల్.. ఇండియన్ వాల్.. ఎంతటి సమస్యనైనా తన తెలివితో చాకచక్యంగా పరిష్కరించేవాడు. అలాంటి ద్రావిడ్ కూడా ధోనిపై కోపంతో అరిచేసాడని ఇండియన్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెబుతున్నాడు. ఓ స్పోర్ట్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో భాగంగా రాహుల్ ద్రావిడ్ గురించి మరికొన్ని విషయాలను తెలియజేశాడు.
క్రికెట్ ఆడే రోజుల్లో ద్రవిడ్ కోపాన్ని తాను చూశానని గతంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పాడు సెహ్వాగ్. 2006లో పాకిస్థాన్‌లో వన్డే మ్యాచ్ సందర్భంగా ధోనీపై అతను అరిచాడని తెలిపాడు. అప్పుడే ద్రవిడ్ కోపాన్ని తాను మొదటిసారి చూశానన్నాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన ధోని పాకిస్థాన్ పర్యటనలో ఓ మ్యాచ్‌లో పేలవ షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు. అప్పుడు ధోనీపై ద్రవిడ్‌కు తీవ్రమైన కోపం వచ్చిందన్నాడు. ‘నువ్వు ఇలాగేనా ఆడేదని.. నువ్వు మ్యాచ్ ముగించాల్సి ఉండేదని కోపంతో మహీపై ఉగిపోయాడని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత ధోని భారీ షాట్లు ఆడలేదని.. ఏమైందని అడిగితే ద్రవిడ్‌తో మళ్లీ తిట్టించుకోవాలనుకోవట్లేదని చెప్పాడని చమత్కరించాడు.
ఇదిలా ఉంటే.. రాహుల్ ద్రావిడ్ నటించిన ఆ యాడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోను సూరత్ పోలీసులు అద్భుతంగా వినియోగించుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికోసం రాహుల్ ద్రావిడ్ శైలిని వినియోగించుకున్నారు. రాహుల్ ద్రావిడ్ ఫోటోను సోషల్ మీడియాలో షోర్ చేసిన సూరత్ పోలీసులు.. ఆ షోటోసౌ ‘ఇందిరానగర్ నుంచి వచ్చినా.. సూరత్ నుంచి వచ్చినా.. రోడ్డుపై గూండాగిరిని ఒప్పుకునేది లేదు’ అని కొటేషన్ పెట్టారు. దాంతోపాటు.. ‘గూండాగిరి సినిమాల్లోనే బాగుంటుంది.. రోడ్డుపై కాదు’ అని సూరత్ పోలీసులు క్యాప్షన్ పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి వార్నింగ్ ఇవ్వడం కోసం సూరత్ పోలీసులు ఇలా ద్రావిడ్ ఫోటోను వినియోగించినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.