ODI World Cup 2027 : రోహిత్, కోహ్లీలకు అదే లాస్ట్ ఛాన్స్.. గంభీర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

ODI World Cup 2027 : గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచినా, 2027 వన్డే ప్రపంచకప్ అసలైన పరీక్ష అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. సౌతాఫ్రికా పరిస్థితుల్లో గంభీర్ వ్యూహాలు కీలకం కానున్నాయి. ప్రస్తుతం జట్టు ఉన్న ఫామ్‌ను చూస్తుంటే గంభీర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ODI World Cup 2027 : రోహిత్, కోహ్లీలకు అదే లాస్ట్ ఛాన్స్.. గంభీర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Gautam Gambhir Sourav Ganguly

Updated on: Mar 14, 2026 | 5:44 PM

ODI World Cup 2027 : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రస్తుతం స్వర్ణయుగాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్ కప్ 2026 వంటి రెండు భారీ ఐసీసీ టైటిళ్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అతి తక్కువ కాలంలోనే రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించిన తొలి భారతీయ కోచ్‌గా గంభీర్ రికార్డు పుటల్లోకి ఎక్కారు. అయితే, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ మాత్రం గంభీర్ అసలు సిసలు పరీక్ష ఇంకా ముందుందని అభిప్రాయపడ్డారు.

సౌరవ్ గంగూలీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైట్ బాల్ క్రికెట్‌లో గంభీర్ వ్యూహాలకు 2027 వన్డే ప్రపంచకప్ అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. ఈ టోర్నీ సౌతాఫ్రికా వేదికగా జరగనుండటమే దీనికి ప్రధాన కారణం. అక్కడి పిచ్‌లు, వాతావరణ పరిస్థితులు ఉపఖండపు జట్లకు అంత తేలికగా లొంగవు. పేస్, బౌన్స్‌కు అనుకూలించే ఆ పిచ్‌లపై టీమిండియాను ప్రపంచ విజేతగా నిలపడమే గంభీర్ నాయకత్వానికి అసలైన గీటురాయి అని గంగూలీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జట్టు ఉన్న ఫామ్‌ను చూస్తుంటే గంభీర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మనందరికీ గుర్తున్నట్లుగా.. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో ఫైనల్ చేరినా, దురదృష్టవశాత్తూ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ గాయం అభిమానుల గుండెల్లో ఇంకా పచ్చిగానే ఉంది. ఆ లోటును 2027లో భర్తీ చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. అంతేకాకుండా, 2027 ప్రపంచకప్ భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చివరి మెగా టోర్నీ అయ్యే అవకాశం ఉంది. ఈ దిగ్గజాలకు ఘనమైన వీడ్కోలు పలకాలంటే ట్రోఫీ గెలవడం గంభీర్‌పై ఉన్న అదనపు ఒత్తిడి అని గంగూలీ విశ్లేషించారు.

కేవలం వైట్ బాల్ క్రికెట్ మాత్రమే కాకుండా, టెస్ట్ క్రికెట్‌లోనూ గంభీర్ తన ముద్ర వేయాలని గంగూలీ సూచించారు. ముఖ్యంగా పిచ్‌ల గురించి ఎక్కువగా ఆలోచించకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడేలా జట్టును సిద్ధం చేయాలని కోరారు. పిచ్ స్వభావాన్ని మెదడులో నుంచి తీసేసి, సహజసిద్ధమైన ఆట తీరుపై దృష్టి పెడితే టెస్టుల్లోనూ భారత్ అగ్రస్థానంలో ఉంటుందని సూచించారు. గంభీర్ ఒక అద్భుతమైన కోచ్ అని, ఆయనకు తగినంత సమయం ఇస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారని గంగూలీ పూర్తి మద్దతు ప్రకటించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us