Pakistan Cricket: పాపం.. 60 ఏళ్లలో ఘోరమైన దుస్థితికి పాక్ క్రికెట్.. పతనానికి కారణాలు ఏంటి?

|

Sep 09, 2024 | 3:56 PM

కొన్నేళ్ల క్రితం వరకు ప్రపంచంలోని మేటి క్రికెట్ జట్లలో ఒకటిగా విరాజిల్లిన జట్టు.. ఇప్పుడు వరుస ఓటములతో పతనం వైపుగా అడుగులు వేస్తోంది. అవును.. ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం పాకిస్థాన్ క్రికెట్ దుస్థితి గురించే మాట్లాడుకుంటోంది. విదేశీ గడ్డలపై పాక్ జట్టు ఆటగాళ్లు అంతంగా రాణిస్తుండగా.. సొంత గడ్డపై కూడా వరుస ఓటములు ఆ జట్టును వెక్కిరిస్తున్నాయి.

Pakistan Cricket: పాపం.. 60 ఏళ్లలో ఘోరమైన దుస్థితికి పాక్ క్రికెట్.. పతనానికి కారణాలు ఏంటి?
pakistan cricket team
Follow us on

కొన్నేళ్ల క్రితం వరకు ప్రపంచంలోని మేటి క్రికెట్ జట్లలో ఒకటిగా విరాజిల్లిన జట్టు.. ఇప్పుడు వరుస ఓటములతో పతనం వైపుగా అడుగులు వేస్తోంది. అవును.. ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం పాకిస్థాన్ క్రికెట్ దుస్థితి గురించే మాట్లాడుకుంటోంది. విదేశీ గడ్డలపై పాక్ జట్టు ఆటగాళ్లు అంతంగా రాణిస్తుండగా.. సొంత గడ్డపై కూడా వరుస ఓటములు ఆ జట్టును వెక్కిరిస్తున్నాయి. మొన్నటికి మొన్న 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను బంగ్లా క్లీన్ స్వీప్ చేసినప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెటర్లతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాభవం తర్వాత గత వారం విడుదలైన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు 9వ స్థానానికి పతనమయ్యింది. గత 60 ఏళ్లలో పాకిస్థాన్ ఇంత ఘోరమైన స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. టెస్ట్ ర్యాంకింగ్స్ పట్టికలో పాకిస్థాన్ కూడా ఆప్గానిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్ తదితర పసికూన జట్ల సరసన చేరిపోవడం సగటు పాక్ క్రికెట్ అభిమానికి గుండెకోతను మిగుల్చుతోంది.

సొంత గడ్డపై జరిగిన గత 10 టెస్ట్ మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ గెలవలేదు. చివరగా 2021 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై విజయం తర్వాత గత 1000 రోజుల్లో పాక్ జట్టుకు సొంత గడ్డపై టెస్ట్ మ్యాచ్ విజయం అందని ద్రాక్షగానే ఉంది. గత ఏడాది వన్డే, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌‌లలోనూ పాకిస్థాన్ జట్టు పేలవమైన ప్రదర్శనతో టోర్నీ మొదట్లోనే ఇంటిముఖం పట్టింది.

పాక్ క్రికెట్ ప్రస్తుత దుస్థితికి కారణం ఏంటన్న అంశంపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమదైన అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్‌లో మితిమీరిన రాజకీయ జోక్యమే ప్రస్తుత దుస్థితికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే నెపోటిజం అంశం కూడా పాక్ క్రికెట్‌కు తీవ్ర ప్రతికూల అంశంగా మారిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తోంది. నెపోటిజం కారణంగా ట్యాలెంట్ కలిగిన ఆటగాళ్లు జట్టులోకి రాలేకపోతున్నారని చెబుతున్నారు. జట్టు ఎంపికలో రాజకీయ జోక్యం, బంధుప్రీతి పెచ్చు మీరిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో అనారోగ్యకరమైన వాతావరణం నెలకొందని, జట్టులో గ్రూపిజం రాజ్యమేలుతోందని ఆ దేశ మీడియా వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. జట్టులోని కొత్త, పాత ఆటగాళ్ల మధ్య నెలకొన్న అనారోగ్యకర పోటీతో జట్టుకు తీవ్ర నష్టం జరుగుతోంది. అటు కెప్టెన్‌ను పదేపదే మార్చడం కూడా ఆ జట్టులో గందరగోళ స్థితికి కారణమవుతోంది.

గత 24 మాసాల కాలంలో పాక్ జట్టుకు నలుగురు కోచ్‌లు పనిచేయగా.. ముగ్గురు పీసీబీ ఛైర్మన్లు మారారు. అలాగే ముగ్గురు కెప్టెన్లు మారారు. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్‌గా ఉన్న మౌసిన్ నఖ్వీ.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగానూ పనిచేస్తున్నారు. ఓ వైపు ఉగ్రవాదుల దాడులు పెరగగా.. మరో వైపు రోజురోజుకూ పతనమవుతున్న పాకిస్థాన్ క్రికెట్‌ను గాటిలో పెట్టడం ఆయనకు సాధ్యంకావడం లేదు. పీసీబీలో అంతా సక్రమంగా లేకపోవడం జట్టుపై ప్రభావం చూపుతోందని ఆ దేశ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.