Nitish Rana : క్రికెట్ తిండిపెడుతుందా అని తిట్టేవారు.. కట్ చేస్తే ఇప్పుడు దానితోనే రూ.40కోట్లకు యజమాని అయి చూపించాడు

చిన్నప్పుడు క్రికెట్ వదిలేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అని సలహా ఇచ్చిన వారికే ఇప్పుడు షాక్ ఇచ్చాడు. ఆ ఆటగాడు ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తికి యజమాని అయ్యాడు. అతడే నితీష్ రాణా. నితీష్ రాణా కెప్టెన్‌గా ఉన్న వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది.

Nitish Rana : క్రికెట్ తిండిపెడుతుందా అని తిట్టేవారు.. కట్ చేస్తే ఇప్పుడు దానితోనే రూ.40కోట్లకు యజమాని అయి చూపించాడు
Nitish Rana

Updated on: Sep 02, 2025 | 7:26 AM

Nitish Rana : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2025 టైటిల్‌ను వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ను ఓడించి ఈ విజయాన్ని సాధించింది. వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఛాంపియన్‌గా నిలవడంలో ఒక ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. చిన్నప్పుడు అతనికి క్రికెట్ వదిలేసి ప్రభుత్వ ఉద్యోగం చేయమని సలహాలు ఇచ్చేవారు. కానీ, ఆ ఆటగాడు క్రికెట్‌ను వదలకుండా కొనసాగించాడు, ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తికి యజమాని అయ్యాడు.

వెస్ట్ ఢిల్లీని గెలిపించిన హీరో

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్‌ను విజేతగా నిలిపిన ఘనత కెప్టెన్ నితీష్ రాణాకు దక్కుతుంది. ఈ సీజన్‌లో అతను భారీగా పరుగులు చేశాడు. ప్లేఆఫ్స్‌లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదు. ఈ సీజన్‌లో అతను 11 మ్యాచ్‌లలో 65.50 సగటుతో 393 పరుగులు సాధించాడు. అతను ఈ పరుగులు 181.94 స్ట్రైక్ రేట్‌తో చేయడం విశేషం. ఫైనల్ మ్యాచ్‌లో కూడా 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో అజేయంగా 79 పరుగులు చేశాడు.

ప్లేఆఫ్స్‌లో నితీష్ రాణా ప్రదర్శనను పరిశీలిస్తే, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 134 నాటౌట్, క్వాలిఫైయర్ 2లో 45 నాటౌట్, ఫైనల్‌లో 79 నాటౌట్ పరుగులు చేశాడు. అంటే, ప్లేఆఫ్స్ మూడు మ్యాచ్‌లలో అతను అవుట్ అవ్వకుండా 24 సిక్స్‌లతో కలిపి 250కి పైగా పరుగులు సాధించాడు. నితీష్ రాణా చిన్నప్పుడు అతని తండ్రి స్నేహితులు క్రికెటర్ అవ్వడం ఎందుకు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే జీవితం బాగుంటుందని సలహా ఇచ్చేవారట. కానీ, నితీష్ వెనక్కి తగ్గకుండా పోరాడి, ఇప్పుడు ఢిల్లీలో అతిపెద్ద క్రికెటర్లలో ఒకడిగా ఎదిగాడు.

నితీష్ రాణా ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?

మీడియా నివేదికల ప్రకారం, నితీష్ రాణా మొత్తం ఆస్తి సుమారు 40 కోట్ల రూపాయలు. అతని ఆస్తిలో రాజస్థాన్ రాయల్స్‌తో ఐపీఎల్ కాంట్రాక్ట్, దేశీయ మ్యాచ్‌ ఫీజులు, ఎండోర్స్‌మెంట్ డీల్స్ కూడా ఉన్నాయి. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ అతన్ని 4.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంతకుముందు అతను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులో ఉన్నాడు. అప్పుడు కేకేఆర్ అతన్ని 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..