Pahalgam Terror Attack: పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు

Pahalgam Terror Attack: ఏప్రిల్ 22 మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. గుర్రపు స్వారీ చేస్తున్న పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి టీం ఇండియా ప్లేయర్లు సంతాపం తెలిపారు.

Pahalgam Terror Attack: పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
Pahalgam Terror Attack 1

Updated on: Apr 23, 2025 | 8:00 AM

Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో భారీ ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 30 మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఇందులో ఇద్దరు విదేశీ పౌరులు కూడా ఉన్నారు. కాగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడ మోహరించిన భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. CRPF బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. పహల్గామ్‌లోని బ్యాసరన్‌లో జరిగిన ఈ సంఘటన తర్వాత, ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ తరువాత షా కూడా జమ్మూ కాశ్మీర్‌కు బయలుదేరాడు. ఈ ఉగ్రవాద దాడి కారణంగా దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సెలబ్రెటీలు కూడా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. ఇక క్రికెటర్లు కూడా ఉగ్రవాదులను ఏరిపారేయాలంటూ ట్వీట్ చేస్తున్నారు. టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు సందేశం ఇస్తూ, ఈ ఘటనకు బాధ్యలైన వారిని విడిచిపెట్టవద్దంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

గౌతమ్ గంభీర్ ట్వీట్..

ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి గౌతమ్ గంభీర్ తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీనికి పూర్తిగా బాధ్యులైన వారిని వదిలిపెట్టవద్దంటూ సూచించాడు. భారతదేశం ఎదురు దాడి చేస్తుందని హెచ్చరించారు. గౌతమ్ గంభీర్ గతంలో బీజేపీ ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. దాడి గురించి సమాచారం అందిన వెంటనే, హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వెంటనే శ్రీనగర్‌కు బయలుదేరి వెళ్లారు. భద్రతా అధికారుల నుంచి సంఘటన గురించి వివరాలు తీసుకొని ఆసుపత్రిలో గాయపడిన వారిని కలవాలని ప్లాన్ చేసుకున్నారు. ప్రధానమంత్రి మోడీ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దోషులను వదిలిపెట్టబోమని అన్నారు. ఈ దాడిని శుభ్‌మాన్ గిల్ ఖండించారు.

2017ని గుర్తు చేస్తోన్న దాడి..

జులై 10, 2017న అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడి చేశారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బాటింగోలో ఈ దాడి జరిగింది. 2017 జులై 11వ తేదీ రాత్రి 8:20 గంటల ప్రాంతంలో, అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సహా ఏడుగురు భక్తులు మరణించారు.

ఇది కాకుండా 32 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారు. ఈసారి కూడా దాడి తర్వాత, ప్రభుత్వం, సైన్యం అప్రమత్తంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణీకుల భద్రత విషయంలో ఎలాంటి లోపం ఉండదని ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..