
CWG 2026 : గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే సంచలన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించాడు. తీవ్రమైన చలి, ఈదురుగాలులు వీస్తున్న వాతావరణంలోనూ తన రెండో ప్రయత్నంలోనే ఏకంగా 89.75 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి ఈ చారిత్రక ఘనత సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 2006 తర్వాత కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో శ్రీలంకకు లభించిన తొలి పసిడి పతకం ఇదే కావడం విశేషం.
భారత్‌కు రజతం, కాంస్య పతకాలు
ఈ ప్రతిష్టాత్మక పోటీలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 85.83 మీటర్ల అత్యుత్తమ త్రో నమోదు చేసి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో అరంగేట్రం చేసిన భారత్‌కే చెందిన యశ్‌వీర్ సింగ్ తన చివరి ప్రయత్నంలో 85.41 మీటర్ల వ్యక్తిగత బెస్ట్ త్రో విసిరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తీవ్ర పోటీ మధ్యలో గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ (83.88మీ) నాలుగో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ స్టార్ అర్షద్ నదీమ్ (77.41మీ) తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ ఛాంపియన్‌గా..
శ్రీలంకలోని కలుతరలో జన్మించిన రుమేష్ తరంగ పతిరాగే ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్‌గా తన క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అండర్-18 స్థాయిలో ఆడుతున్నప్పుడు క్రమం తప్పకుండా గంటకు 130 కి.మీ నుంచి 134 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తూ మంచి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అయితే తన తండ్రి మార్గదర్శకత్వంలో మొదట డిస్కస్ త్రో నేర్చుకుని, 2017లో కోచ్ టోనీ సలహాతో జావెలిన్ త్రో వైపు అడుగులు వేశాడు. ఈ నిర్ణయమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. జావెలిన్‌లో ప్రాథమిక సూత్రాలు సరిగ్గా పాటిస్తే ఖచ్చితంగా విజయాలు సాధిస్తావని కోచ్ ఇచ్చిన ప్రోత్సాహమే ఈ స్థాయికి తెచ్చిందని పతిరాగే గుర్తుచేసుకున్నాడు.
క్రికెట్ పై తగ్గని ప్రేమ…
వృత్తిరీత్యా జావెలిన్ క్రీడాకారుడిగా మారినప్పటికీ, పతిరాగేకు క్రికెట్‌పై ఉన్న మక్కువ మాత్రం తగ్గలేదు. ప్రొఫెషనల్ టోర్నమెంట్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పటికీ స్వగ్రామానికి వెళ్లినప్పుడు తన చిన్ననాటి స్నేహితులతో కలిసి సాఫ్ట్‌బాల్ క్రికెట్ ఆడుతుంటాడు. సరదాగా ఆడే ఈ క్రికెట్ మ్యాచ్‌లు తన మనస్సుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయని పతిరాగే మీడియాకు తెలిపాడు.
రెండు రకాల క్రీడలు ఆడిన ఇతర ప్రముఖ క్రికెటర్లు
రుమేష్ తరంగ పతిరాగే మాత్రమే కాకుండా.. గతంలో కూడా చాలామంది దిగ్గజ క్రికెటర్లు ఇతర క్రీడల్లోనూ తమ సత్తా చాటారు. భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ క్రికెట్ ఆడటానికి ముందు ఇంటర్నేషనల్ స్థాయిలో చెస్ ఆడాడు. వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ క్రికెట్‌తో పాటు తమ దేశం తరఫున ఫుట్‌బాల్ కూడా ఆడాడు. దక్షిణాఫ్రికా రన్ అవుట్ కింగ్ జాంటీ రోడ్స్ హాకీ, క్రికెట్ రెండింటిలోనూ రాణించాడు. ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ క్రికెట్ నుంచి తప్పుకున్నాక ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు అడుగులు వేశాడు. అలాగే ఆస్ట్రేలియా ఉమెన్ స్టార్ అథ్లెట్ ఎలిస్ పెర్రీ ఫుట్‌బాల్ (సాకర్), క్రికెట్ రెండింటిలోనూ ప్రపంచకప్‌లు ఆడిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించగా, ఇంగ్లాండ్ మాజీ పేసర్ లియామ్ ప్లంకెట్ బేస్‌బాల్, క్రికెట్ రెండింటిలోనూ తన సత్తా చాటాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..