
Vaibhav Suryavanshi : కేవలం 14 ఏళ్ల వయసులోనే తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పై టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న U19 వరల్డ్ కప్ 2026లో వైభవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. సూపర్ సిక్స్ దశలో భారత్.. జింబాబ్వే (జనవరి 27), పాకిస్థాన్ (ఫిబ్రవరి 1) జట్లతో తలపడనున్న నేపథ్యంలో ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో యూవీ వైభవ్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సాధారణంగా ఎవరినీ అంత తొందరగా మెచ్చుకోడు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆటతీరు చూశాక యువరాజ్ తనను తాను ఆపుకోలేకపోయారు. “వైభవ్ ఒక అసాధారణమైన టాలెంట్ పర్సన్. అతని ఆటలో నాకు బాగా నచ్చింది ఏమిటంటే.. భయం లేని తన సహజ సిద్ధమైన ధోరణి. నెట్స్‌లో వేగంగా వచ్చే బౌన్సర్లను అతను ఎదుర్కొంటున్న తీరు అద్భుతం. మెడ దగ్గరకు వచ్చే బంతులను కూడా హుక్ లేదా పుల్ షాట్లు ఆడటానికి అతను ఏమాత్రం సంకోచించడం లేదు. పెద్ద జట్లపై కూడా అతను ఇలాగే స్థిరంగా ఆడితే, భారత్‌కు ఒక గొప్ప ఆటగాడు దొరికినట్లే” అని యువరాజ్ సింగ్ ప్రశంసించారు.
వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే తన పేరిట అనేక రికార్డులను లిఖించుకున్నాడు. 2025 ఏప్రిల్‌లో కేవలం 14 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతను, గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా, భారత్ తరపున అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆ సీజన్‌లో 252 పరుగులు చేసి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కూడా అందుకున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న U19 వరల్డ్ కప్‌లో కూడా వైభవ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లోనే 40 పరుగులు చేసి భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చాడు. ఆయుష్ మాత్రే నేతృత్వంలోని భారత జట్టు ఇప్పుడు సూపర్ సిక్స్ దశలోకి అడుగుపెట్టింది. ఈ దశలో వైభవ్ బ్యాటింగ్ కీలకం కానుంది. కేవలం 14 ఏళ్లకే అటు ఐపీఎల్‌లో, ఇటు అంతర్జాతీయ వేదికలపై రికార్డుల వేట సాగిస్తున్న వైభవ్ గురించి యువరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..