Shreyas Iyer: భారత్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం ఇంకా సందేహంగానే ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న అతను తన పునరాగమనంపై కుండబద్దలు కొట్టినట్లు స్పందించాడు. ఔట్‌లుక్ఇండియా అనే వెబ్‌సైట్ కథనం ప్రకారం అయ్యర్ ‘‘ఎన్‌సీఏ నుంచి ఎప్పుడు అడుగు బయట పెట్టినా నాతో సెల్ఫీల కోసం చాలా మంది ఎగబడుతున్నారు. ఆ సమయంలో వారు నన్ను ‘ఎప్పుడు తిరిగి వస్తావ్’ అని అడుగుతున్నారు. కానీ భారత జట్టులోని నేను ఎప్పుడు తిరిగి వస్తానో నాకే తెలియదు’’ అని అన్నాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టు సమయంలో వెన్ను నొప్పితో ఆటకు దూరమయ్యాడు అయ్యర్. ఆ కారణంగానే ఐపీఎల్ 2023, ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి దూరంగా ఉన్నాడు. లండన్‌లో సర్జరీ చేయించుకున్న అతను ఇప్పుడు బెంగళూరు పునరావస కేంద్రంలో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కూడా దిగాలుగా ఉంది. ఎన్‌సీఏలో అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోతున్నాడు. వెన్ను నొప్పి కారణంగానే వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్న అతను.. ఇప్పుడు ఆసియా కప్‌కి అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత రావట్లేదు.
కాగా, బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి అయ్యర్ పునరాగమనం గురించి మాట్లాడుతూ ‘శ్రేయాస్ అయ్యర్ నిదానంగా కోలుకుంటున్నాడు. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ నాటికి అతను జట్టులోకి వచ్చేలా కోలుకుంటాడు. ఇప్పటికి అయితే అయ్యర్ గురించి ఏం చెప్పలేము’ అని అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..