
Don Bradmans Legendary Baggy Green Cap Smashes Auction Records: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ ధరించిన బ్యాగీ గ్రీన్ టోపీ వేలంలో రికార్డు ధర పలికింది. ఆస్ట్రేలియా డే సందర్భంగా గోల్డ్ కోస్ట్ లో నిర్వహించిన వేలంలో ఈ క్యాప్ ఏకంగా నాలుగు లక్షల అరవై వేల ఆస్ట్రేలియా డాలర్లు దక్కించుకుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రెండు కోట్ల తొంభై లక్షలకు సమానం. ఇప్పటివరకు వేలం వేసిన బ్రాడ్‌మన్ క్యాప్‌లలో ఇదే అత్యధిక ధర.
ఈ ప్రత్యేకమైన క్యాప్ కు గొప్ప చరిత్ర ఉంది. బ్రాడ్‌మన్ 1947-48లో భారత్‌తో జరిగిన సిరీస్ లో దీనిని ధరించారు. ఆ తర్వాత దీనిని భారత ఆల్ రౌండర్ శ్రీరంగ వాసుదేవ్ సోహోనీకి బహుమతిగా ఇచ్చారు. సుమారు 75 సంవత్సరాల పాటు శ్రీరంగ వాసుదేవ్ సోహోనీ కుటుంబం ఈ టోపీని భద్రపరిచింది. సోహోనీ చివరి కోరిక మేరకు ఈ టోపీ తిరిగి ఆస్ట్రేలియాకు చేరింది. వేలం వేసిన టోపీ లోపలి వైపు వాసుదేవ్, బ్రాడ్‌మన్ పేర్లు ఉన్నాయి. ఈ వేలం క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ స్థాయి ఇప్పటికీ తగ్గలేదని మరోసారి నిరూపించింది.
లాలా అమర్‌నాథ్ కెప్టెన్సీలో భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆ సిరీస్, బ్రాడ్‌మన్‌కు ఆస్ట్రేలియా గడ్డపై చివరి సిరీస్ కావడం విశేషం. ఐదు టెస్టుల సిరీస్ లో భారత జట్టు నాలుగు సున్నాతో ఓటమి పాలైంది. ఈ సిరీస్‌లో డాన్ బ్రాడ్‌మన్ నాలుగు సెంచరీలు సాధించారు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. సిరీస్ మొత్తంగా ఆయన 715 పరుగులు చేశారు. దాదాపు 78 సంవత్సరాల తర్వాత బ్రాడ్‌మన్ ఇచ్చిన ఈ క్యాప్‌ను వేలం వేయగా, భారీ ధర పలికి క్రికెట్ దిగ్గజం రేంజ్ తగ్గలేదని మరోసారి నిరూపించింది.
ఈ వేలం సందర్భంగా అభిమానులు డాన్ బ్రాడ్‌మన్ రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన సాధించిన అద్భుతమైన రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజం తన టెస్ట్ కెరీర్‌ను 1928లో ప్రారంభించి 1948 వరకు కొనసాగించారు. ఆయన మొత్తం 52 టెస్టుల్లో ఆడి 80 ఇన్నింగ్స్ లలో 6,996 పరుగులు చేశారు. ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 334 పరుగులు. కెరీర్ లో 29 టెస్టు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు సాధించారు. ఆయన టెస్ట్ ఆవరేజ్ అసాధారణంగా 99.94.
బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో 234 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో బరిలో దిగి 338 ఇన్నింగ్స్ లలో 28,067 పరుగులు చేశారు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో ఆయన అత్యధిక స్కోరు 452 పరుగులు, ఆవరేజ్ 95.14. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆయన 117 సెంచరీలు, 69 హాఫ్ సెంచరీలు సాధించారు. ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 36 వికెట్లు, టెస్ట్ క్రికెట్‌లో రెండు వికెట్లు కూడా తీశారు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఆవరేజ్ ఉన్న ఆటగాడిగా బ్రాడ్‌మన్ ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నారు. ఆయన సాధించిన 29 సెంచరీలలో 12 డబుల్ సెంచరీలు ఉండటం మరో రికార్డు. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్ గానూ ఆయన రికార్డుల్లో నిలిచారు. ఇంగ్లాండ్‌పై అత్యధికంగా 19 సెంచరీలు చేశారు, ఒక జట్టుపై అత్యధిక సెంచరీల రికార్డు కూడా బ్రాడ్‌మన్ పేరిటే ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..