మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తర్వాత టీమ్ ఇండియా ఫినిషర్ కోసం వెతుకుతోంది. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ఈ పనికి సరిపోతారని భావించారు, కానీ అతను ఫిట్‌నెస్ లేమితో జట్టులో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం జట్టుకు ఫినిషర్ లేడు. ఇలాంటి పరిస్థితిలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్(dinesh Karthik) ఈ స్థానానికి తగినవాడు అంటూ కొందరు చెబుతున్నారు. కార్తీక్ 2019 ప్రపంచ కప్‌లో భారత జట్టు తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతను జట్టుకు దూరమయ్యాడు. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఏర్పాటు చేయాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నారు, అందుకే కార్తీక్‌ను జట్టులోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు తను టీమిండియాలోకి తిరిగి వస్తానని కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇండియా టుడేతో మాట్లాడిన కార్తీక్, “నేను మళ్లీ భారత జట్టు కోసం ఆడాలనుకుంటున్నాను. దాని కోసం సాధ్యమైనదంతా చేస్తాను. ఇదే నా లక్ష్యం. నేను ప్రస్తుతం నా లక్ష్యాన్ని సాధించడానికి శిక్షణ, సాధన చేస్తున్నాను. రాబోయే మూడేళ్లలో, నేను క్రీడలు ఆడాలనుకుంటున్నాను. నేను చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నాను. నేను ఆటను ఆస్వాదిస్తున్నాను.” అని కార్తీక్ చెప్పాడు.
టీ20 ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు ఆడే సత్తా తనకు ఇంకా ఉందని కార్తీక్ చెప్పాడు. ‘మళ్లీ దేశం తరఫున ఆడాలన్నదే నా లక్ష్యం. ముఖ్యంగా టీ20 ఫార్మాట్. టీ20 అంటే నాకు ఇంకా ఫైర్ ఉంది. గత టీ20 ప్రపంచకప్‌లో ప్రధాన సమస్య ఫినిషర్. నేను ఆ పాత్రపై దృష్టి సారిస్తున్నాను.’ అని వివరించాడు.
కార్తీక్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫు ఆడుతున్నాడు. కానీ ఈసారి అతనిని జట్టు రిటైన్ చేయలేదు. ఇంగ్లాండ్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో కార్తీక్ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు. కార్తీక్ భారత్ తరఫున ఇప్పటివరకు 26 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1025 పరుగులు చేశాడు. వన్డేల్లో 94 మ్యాచ్‌లు ఆడి 1752 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతనికి ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Read Also.. Virat Kohli: విరాట్ కోహ్లీ అసాధారణ కెప్టెన్.. జో రూట్ మాత్రం అలా కాదు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడి వ్యాఖ్యలు..