ధోని ఫట్.. రోహిత్ హిట్.. కోహ్లీపై నో ఎఫెక్ట్.. పెళ్లి తర్వాత కెరీర్‌లో కీలక మార్పులు.. కేఎల్ రాహుల్ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
భారత జట్టులో రాహుల్‌తో కలిసి ఆడిన స్టార్ ఆటగాళ్ల కెరీర్‌పై పెళ్లి ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వారి కెరీర్ పెళ్లి తర్వాత ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ జనవరి 23న పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందుకోసం న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి విరామం తీసుకున్నాడు. పెళ్లయ్యాక మళ్లీ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియాలో చేరనున్నాడు. ప్రస్తుతం పెళ్లి పనులతో చాలా బిజీగా ఉన్నాడు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అయితే, ప్రస్తుతం వరుస ఫ్లాపులతో కేఎల్ రాహుల్.. మ్యారెజ్ అనంతరం ఫుల్ స్వింగ్‌లో కనిపించనున్నడని తెలుస్తోంది. అందుకు ఓ కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లి తర్వాత ప్రదర్శన మెరుగ్గా ఉంటుందా, తగ్గుతుందా?
దీనికి ఖచ్చితమైన సమాధానం కాలక్రమేణా తెలుస్తుంది. ఇందులో పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం.. భారత జట్టులో రాహుల్‌తో కలిసి ఆడిన స్టార్ ఆటగాళ్ల కెరీర్‌పై పెళ్లి ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వారి కెరీర్ పెళ్లి తర్వాత ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆటగాళ్లు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా మంచి కెరీర్‌ను కలిగి ఉన్నారు.
రాహుల్ వివాహాం ఎప్పుడంటే..
కేఎల్ రాహుల్ జనవరి 23 న బాలీవుడ్ నటి అథియా శెట్టిని వివాహం చేసుకోనున్నారు. అతియా ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కుమార్తె. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జనవరి 21న ప్రారంభం కానున్నాయి. వీరి పెళ్లికి కొంతమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందింది.
రాహుల్ కెరీర్..
భారత్ తరపున మూడు ఫార్మాట్‌లు ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకరు. 2014లో భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత, అతను 2019 వన్డే ప్రపంచ కప్, 2021, 2022 టీ20 ప్రపంచ కప్‌లలో కూడా ఆడాడు. 2021లో తొలిసారిగా జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కొన్ని సిరీస్ విజయాల్లో రాహుల్ కూడా కీలక పాత్ర పోషించాడు.
ఇప్పటి వరకు ఆడిన 45 టెస్టుల్లో 34.26 సగటుతో 2604 పరుగులు చేశాడు. ఇందులో అతని బ్యాట్ నుంచి 7 సెంచరీలు, 13 ఫిఫ్టీలు వచ్చాయి. అతను భారతదేశం వెలుపలే 6 సెంచరీలు నమోదు చేశాడు. 51 వన్డేల్లో 44.52 సగటుతో 1870 పరుగులు చేశాడు. వీటిలో 5 సెంచరీలు, 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో రాహుల్ 72 టీ20ల్లో 139.12 స్ట్రైక్ రేట్‌తో 2265 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 2 సెంచరీలు, 22 అర్ధసెంచరీలు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెటర్‌గా కెరీర్‌ను చక్కగా కొనసాగించాడు.
ప్లేయర్ ఫట్.. కెప్టెన్‌గా హిట్ అయిన ధోనీ..
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 4 జులై 2010న సాక్షి సింగ్‌ని వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందు తన కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ను గెలుచుకున్నాడు. పెళ్లికి సరిగ్గా 2 సంవత్సరాల ముందు అంటే 2008 నుంచి 2010 వరకు, ధోని 14 టెస్టుల్లో 67.33 సగటుతో 1010 పరుగులు చేశాడు. వీటిలో 3 సెంచరీలు, 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. 52 వన్డేల్లో 58.34 సగటుతో 2042 పరుగులు చేశాడు. వీటిలో 3 సెంచరీలు, 14 ఫిఫ్టీలు ఉన్నాయి. 15 టీ20ల్లో 112.55 స్ట్రైక్ రేట్‌తో 269 పరుగులు చేశాడు.
పెళ్లయిన రెండేళ్ల తర్వాత అంటే జులై 2010 నుంచి జులై 2012 వరకు, ధోనీ 24 టెస్టుల్లో 29.21 సగటుతో 1081 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, 7 అర్ధసెంచరీలు వచ్చాయి. 40 వన్డేల్లో 53.63 సగటుతో 1180 పరుగులు చేశాడు. అదే సమయంలో ధోని 6 టీ20లలో 101.88 స్ట్రైక్ రేట్‌తో 108 పరుగులు చేశాడు. పెళ్లి తర్వాత ధోని బ్యాటింగ్ ఫామ్ కాస్త బలహీనపడింది. కానీ, కెప్టెన్‌గా మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. 2011 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్‌కు అందించాడు.
విరాట్ కోహ్లీ పరిస్థితి ఎంతో భిన్నం..
2017 డిసెంబర్ 11 న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. విరాట్ పెళ్లికి ముందు భారత టెస్ట్ కెప్టెన్, వివాహం తర్వాత అతను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యాడు. డిసెంబర్ 2015 నుంచి డిసెంబర్ 2017 వరకు, అంటే పెళ్లికి 2 సంవత్సరాల ముందు, విరాట్ 22 టెస్టుల్లో 75.80 సగటుతో 2274 పరుగులు చేశాడు. వీటిలో 9 సెంచరీలు, 3 అర్ధశతకాలు సాధించాడు. 36 వన్డేల్లో 81.44 సగటుతో 2199 పరుగులు చేశాడు. వీటిలో కూడా 9 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో 25 టీ20ల్లో 143.95 స్ట్రైక్ రేట్‌తో 940 పరుగులు చేశాడు.
వివాహం తర్వాత, కోహ్లీ కెప్టెన్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్స్‌కు భారత్‌ను నడిపించాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్‌లను గెలుచుకున్నాడు. 2017 నుంచి 2019 వరకు 21 టెస్టుల్లో 58.60 సగటుతో 1934 పరుగులు చేశాడు. వీటిలో 7 సెంచరీలు, 7 అర్ధశతకాలు ఉన్నాయి. 37 వన్డేల్లో 85.85 సగటుతో 2490 పరుగులు చేశాడు. వీటిలో 11 సెంచరీలు, 9 ఫిఫ్టీలు వచ్చాయి. అదే సమయంలో 20 టీ20ల్లో 138.72 స్ట్రైక్ రేట్‌తో 677 పరుగులు చేశాడు.
మొత్తానికి పెళ్లికి ముందు, తర్వాత విరాట్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ తేడా ఏమీ కనిపించలేదు. 2019 నుంచి 2020 వరకు ఫామ్‌లో లేడు. కానీ అప్పటికి కోహ్లీ వివాహం అయ్యి చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పుడు మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ గత ఐదు వన్డేల్లో మూడు సెంచరీలు సాధించాడు.
రోహిత్ ప్రదర్శనలో అద్భుతమైన మెరుగుదల..
13 డిసెంబర్ 2015న, టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రితికా సజ్దేను వివాహం చేసుకున్నాడు. 2013, 2015 మధ్య, అతను తన వివాహానికి రెండు సంవత్సరాల ముందు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. ఆ తర్వాత 14 టెస్టుల్లో 23.38 సగటుతో 608 పరుగులు చేశాడు. 29 వన్డేల్లో 51.59 సగటుతో 1393 పరుగులు చేశాడు. వీటిలో 2 డబుల్ సెంచరీలతోపాటు 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు వచ్చాయి. అదే సమయంలో 8 టీ20ల్లో 130.15 స్ట్రైక్ రేట్‌తో 328 పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీ, 2 ఫిఫ్టీలు ఉన్నాయి.
పెళ్లి తర్వాత 2015 నుంచి 2017 వరకు ఆడిన 7 టెస్టుల్లో 84.16 సగటుతో 505 పరుగులు చేశాడు. 30 వన్డేల్లో 71.15 సగటుతో 1850 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు కూడా సాధించాడు. అదే సమయంలో 24 టీ20ల్లో 132.33 స్ట్రైక్ రేట్‌తో 618 పరుగులు చేశాడు. పెళ్లి తర్వాత రోహిత్ మెరుగైన బ్యాట్స్‌మెన్‌గా మారాడని గణాంకాలు చెబుతున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..