Dewald Brevis Auction Price: అండర్ 19 వరల్డ్ కప్ సెన్సేషన్, దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ దేవల్ద్ బ్రేవిస్‌ను రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. వేలంలో మొదటిగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు ఈ ప్లేయర్ కోసం పోటీపడగా.. చివరికి ముంబై ఇండియన్స్ వచ్చి తన్నుకుపోయింది.
బ్రేవిస్.. అండర్ 19 వరల్డ్ కప్‌లో పరుగుల వర్షం కురిపించాడు. టోర్నమెంట్‌లో టాప్ రన్ గెటర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. 6 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో మొత్తంగా 506 పరుగులు చేశాడు. డివిలియర్స్ మాదిరిగా 360 స్టైల్‌లో అన్ని వైపులా షాట్స్ ఆడగల సత్తా బ్రేవిస్ సొంతం. అండర్ 19 వరల్డ్ కప్‌లో టాప్ రన్ స్కోరర్‌గా అగ్రస్థానంలో నిలిచిన బ్రేవిస్.. గతంలో శిఖర్ ధావన్(505) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. బ్రేవిస్ ఆటతీరుకు క్రికెట్ పండితులు, సీనియర్లను ఆశ్చర్యపరిచింది. ఈ 18 ఏళ్ల మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ను సౌతాఫ్రికా ఫ్యాన్స్ ‘బేబీ డివిలియర్స్’గా పిలుచుకుంటున్నారు. బ్రేవిస్‌కు డివిలియర్సే రోల్ మోడల్. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ తనకు ఇష్టమైన క్రికెటర్లన్న బ్రేవిస్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీలో ఆడాలని అనుకుంటున్నట్లు గతంలోనే తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు. అయితే వేలంలో ఆర్సీబీ.. బ్రేవిస్‌పై ఎలాంటి బిడ్ వేయకపోవడం గమనార్హం. చివరికి మెగా వేలంలో బ్రేవిస్‌ను ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. అటు సచిన్.. ఇటు జయవర్దనే.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండటంతో బ్రేవిస్ వేగంగా పరుగులు రాబట్టగలడని చెప్పొచ్చు.