
IPL 2027 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్ల ఎంపిక, జట్టు బలాబలాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తన వేలం వ్యూహంపై కీలక సంకేతాలు ఇచ్చింది. ఆ జట్టు నూతన ప్రధాన కోచ్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఇద్దరు విదేశీ ఆటగాళ్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (Jake Fraser-McGurk), వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్ (Shai Hope)లను తిరిగి జట్టులోకి తీసుకోవాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోంది. దీంతో రాబోయే మినీ వేలంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసం ఢిల్లీ పోటీ పడే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇప్పటికే పరిచయమున్న ఆటగాడు. 2024 ఐపీఎల్‌లో లుంగి ఎంగిడి స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన అతడు, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించి అతడిని తిరిగి జట్టులో కొనసాగించింది. ఇప్పటివరకు 15 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్ 25.67 సగటుతో 385 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 199.49గా ఉంది. అందుకే మరోసారి ఈ ఆస్ట్రేలియా ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని ఢిల్లీ భావిస్తోంది.
వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్ కూడా గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. 2024 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ అతడిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాతి సీజన్‌కు ముందు అతడిని విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి హోప్‌ను జట్టులోకి తీసుకోవాలని గంగూలీ ఆసక్తి చూపిస్తున్నారు. వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగల సామర్థ్యం హోప్‌కు ఉండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం.
ఆనందబజార్ పత్రిక కథనం ప్రకారం, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. తమ దృష్టిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉన్నారని, ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రేజర్ మెక్‌గుర్క్, వెస్టిండీస్‌కు చెందిన షై హోప్‌లను జట్టులోకి తీసుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
దీంతో ఐపీఎల్ 2027 మినీ వేలంలో ఈ ఇద్దరు ఆటగాళ్లపై ఆసక్తికరమైన పోటీ కనిపించే అవకాశం ఉంది. అయితే వీరి కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఎంతవరకు ఖర్చు చేస్తుందో వేలం జరిగే వరకు వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..