David Warner Arrested: ఆపని చేస్తూ అడ్డంగా బుక్కైన డేవిడ్ వార్నర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

David Warner Arrested: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ఆరంభం నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్ మద్యం మత్తులో వాహనం నడిపి పోలీసులకు చిక్కడం క్రీడాలోకంలో కలకలం రేపుతోంది. అసలే అంతంతమాత్రంగా సాగుతున్న ఈ లీగ్ ప్రతిష్ఠ.. వార్నర్ అరెస్ట్ ఉదంతం మరింత మసకబార్చేలా కనిపిస్తోంది. క్రికెట్ అభిమానులను ఈ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

David Warner Arrested: ఆపని చేస్తూ అడ్డంగా బుక్కైన డేవిడ్ వార్నర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
David Warner Arrested

Updated on: Apr 07, 2026 | 5:41 PM

David Warner Arrested: పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న డేవిడ్ వార్నర్, వరుసగా మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత చిన్న విరామం తీసుకున్నాడు. ఈ విరామ సమయంలో ఏప్రిల్ 3న ఆయన తన స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ విహరిస్తున్న సమయంలో వార్నర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. తనిఖీల్లో ఆయన రక్తంలో ఆల్కహాల్ పరిమాణం 0.104 శాతంగా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలోని చట్టబద్ధమైన పరిమితి కంటే రెట్టింపు ఉండటం గమనార్హం.

కటకటాల వెనక్కి స్టార్ బ్యాటర్..

నిబంధనలను అతిక్రమించినందుకుగాను పోలీసులు వార్నర్‌ను తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. వార్నర్‌ను వచ్చే నెలలో కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. మైదానంలో దూకుడుగా ఉండే వార్నర్, గతంలోనూ సహచర ఆటగాళ్లు, ప్రత్యర్థులతో గొడవలకు దిగి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల మొయిన్ అలీతో జరిగిన వాగ్వాదం మరువకముందే ఈ అరెస్ట్ ఉదంతం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.

లీగ్ భవితవ్యంపై నీలినీడలు..

భారత టీ20 లీగ్ వేలంలో నిరాశ ఎదురైన తర్వాత వార్నర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు మొగ్గు చూపాడు. కరాచీ జట్టు బాధ్యతలు చేపట్టిన ఆయన, ఇప్పుడు చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవడంతో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే నిర్వహణ లోపాలు, ఆటగాళ్ల గైర్హాజరీతో ఇబ్బంది పడుతున్న ఈ లీగ్‌కు వార్నర్ అరెస్ట్ పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us