
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించినప్పటికీ, జట్టు ఎంపిక తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రూ. 14.20 కోట్లు పెట్టి కొన్న ప్రశాంత్ వీర్‌ను జట్టులోకి తీసుకోవడం కోసం, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అఖీల్ హోసేన్‌ను పక్కన పెట్టడం పట్ల సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం భారీ మొత్తానికి సంతకం చేసినందువల్లే కొందరికి ప్రాధాన్యత ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన బద్రీనాథ్, చెన్నై యాజమాన్యం తమ పాత పద్ధతులను మర్చిపోతోందని విమర్శించారు. “ఆటగాళ్లు తమ స్థానానికి న్యాయం చేస్తున్నారా లేదా అన్నది చూడకుండా, వారి ధరను బట్టి జట్టులోకి తీసుకోవడం తప్పుడు నిర్ణయం. మ్యాచ్ గెలిచినంత మాత్రాన చేసిన ప్రతి ఎంపిక సరైనదని భావించలేము” అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పవర్ ప్లేలో అనుభవం లేని బౌలర్ తో బౌలింగ్ చేయించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
వెస్టిండీస్ బౌలర్ అఖీల్ హోసేన్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఆరు వికెట్లు పడగొట్టారు. ఇందులో ఒక ఫోర్ వికెట్ హాల్ కూడా ఉంది. అంతటి ప్రభావం చూపగల బౌలర్ అందుబాటులో ఉండగా, గతంలో ఐపీఎల్‌లో బౌలింగ్ చేసిన అనుభవం లేని ప్రశాంత్ వీర్‌కు ఐదో ఓవర్ ఇవ్వడం వ్యూహాత్మక తప్పిదమని బద్రీనాథ్ పేర్కొన్నారు. ముంబైపై ప్రశాంత్ రెండు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
చెన్నై రూ. 14.20 కోట్లు వెచ్చించిన మరో ఆటగాడు కార్తీక్ శర్మ మాత్రం ఈ మ్యాచ్‌లో తన విలువను నిరూపించుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీని సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ప్రతిభ కంటే ధరకే ప్రాముఖ్యతనిస్తే భవిష్యత్తులో జట్టు సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..