
Cricket Records: టీ20 క్రికెట్‌ను సాధారణంగా బ్యాటర్ల గేమ్‌గా పరిగణిస్తారు. కానీ గత కొన్నేళ్లుగా తమ అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో ఈ ఫార్మాట్‌పై చెరగని ముద్ర వేసిన బౌలర్లు ఎందరో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు దిగ్గజ బౌలర్లు టి20 క్రికెట్‌లో 500 కంటే ఎక్కువ వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. వీరిలో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అందరికంటే ముందువరుసలో ఉన్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే వేర్వేరు టి20 లీగ్‌లలో నిలకడగా రాణిస్తూ రషీద్ ఖాన్ ఏకంగా 700 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, వేరియేషన్లు ప్రత్యర్థి బ్యాటర్లను తీవ్రంగా ముప్పుతిప్పలు పెడుతుంటాయి.
500 వికెట్ల క్లబ్‌లో మెరిసిన విదేశీ దిగ్గజాలు
రషీద్ ఖాన్ తర్వాత వెస్టిండీస్ స్టార్ ఆటగాళ్లు సునీల్ నరైన్, డ్వేన్ బ్రావో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నిలిచారు. వీరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) లతో పాటు ప్రపంచంలోని ప్రముఖ టి20 లీగ్‌లలో తమ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారారు. వీరితో పాటు సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్లు కూడా టి20ల్లో 500 కంటే ఎక్కువ వికెట్లు తీసిన దిగ్గజాల ప్రత్యేక జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
భారత బౌలర్లకు ఇంకా దక్కని 400 వికెట్ల మైలురాయి
విదేశీ బౌలర్లు 500 నుండి 700 వికెట్ల వరకు పడగొట్టి రికార్డులు సృష్టిస్తుంటే.. భారత బౌలర్ల విషయానికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఏ ఒక్క భారత బౌలర్ కూడా టి20 క్రికెట్‌లో కనీసం 400 వికెట్ల మార్క్‌ను చేరుకోలేకపోయారు. ప్రస్తుతం భారత బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్న యుజ్వేంద్ర చాహల్ పేరు మీద 396 వికెట్లు నమోదయ్యాయి. చాహల్ ఐపీఎల్, దేశవాళీ టి20ల్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, ఆ ప్రతిష్టాత్మకమైన 400 వికెట్ల మైలురాయికి ఇంకా కొద్ది దూరంలోనే నిలిచిపోయారు.
భారత బౌలర్లు వెనుకబడటానికి ప్రధాన కారణాలు
భారత బౌలర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. టి20 వికెట్ల సంఖ్యలో వెనుకబడటానికి బీసీసీఐ నియమావళే ప్రధాన కారణం. విదేశీ ఆటగాళ్లలాగా భారత పురుష క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా జరిగే బిగ్ బాష్ లీగ్, సీపీఎల్, పీఎస్ఎల్, ది హండ్రెడ్ వంటి ఇతర దేశాల టి20 లీగ్‌లలో ఆడటానికి అనుమతి లేదు. భారత ఆటగాళ్లు కేవలం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడటం వల్ల వారికీ లభించే మ్యాచ్‌ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. అందువల్లనే 500 వికెట్ల క్లబ్‌లో భారత బౌలర్లు ఇంకా అడుగుపెట్టలేకపోయారు. రాబోయే కాలంలో యుజ్వేంద్ర చాహల్ 400 వికెట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..