Rajesh Bishnoi : అరుణాచల్ ప్రదేశ్ నుంచి రాజస్థాన్ దాకా..ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న కానిస్టేబుల్ కొడుకు

Rajesh Bishnoi : రంజీ ట్రోఫీలో రాజస్థాన్ జట్టుకు కీలక ఆటగాడిగా రాజేష్ బిష్ణోయ్ నిలుస్తున్నాడు. బ్యాటింగ్‌లో అవసరమైనప్పుడు జట్టును ఆదుకునే ఇన్నింగ్స్‌లు, బౌలింగ్‌లో వికెట్లు తీసే సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ఆడే మ్యాచ్ మెచ్యూరిటీ అతడి బలంగా మారింది.

Rajesh Bishnoi : అరుణాచల్ ప్రదేశ్ నుంచి రాజస్థాన్ దాకా..ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న కానిస్టేబుల్ కొడుకు
Rajesh Bishnoi

Updated on: Jan 27, 2026 | 6:32 AM

Rajesh Bishnoi : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అంటారు.. కానీ ఇక్కడ ఒక యువకుడు కష్టపడి స్టార్ క్రికెటర్ అయ్యాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా, చావడియా అనే ఒక చిన్న గ్రామం నుంచి మొదలైన ప్రయాణం.. ఈరోజు దేశవాళీ క్రికెట్‌లో ఒక సంచలనంగా మారింది. అతనే రాజేష్ బిష్ణోయ్. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు, నేడు రాజస్థాన్ రంజీ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. కలలు కనడం ఎంత ముఖ్యమో, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడటం కూడా అంతే అవసరం అని నిరూపించాడు రాజేష్ బిష్ణోయ్. 36 ఏళ్ల రాజేష్ ప్రయాణం ఒక సాదాసీదా కానిస్టేబుల్ కొడుకుగా మొదలైంది. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక తపస్సు అని నమ్మి ఇష్టంతో ప్రాక్టీస్ చేశాడు. రాజస్థాన్ రంజీ జట్టులో చోటు సంపాదించడం అనేది అంత సులభం కాదు, కానీ రాజేష్ తన అసాధారణ ప్రతిభతో సెలక్టర్ల మనసు గెలుచుకున్నాడు. గతంలో కూడా రంజీ ఆడిన అనుభవం ఉన్న రాజేష్, మరోసారి రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు.

రాజేష్ బిష్ణోయ్ కేవలం రాజస్థాన్‌కే పరిమితం కాలేదు. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ జట్ల తరపున కూడా ఆడి తన సత్తా చాటాడు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ తరపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాజేష్ విశ్వరూపం చూపించాడు. ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టడమే కాకుండా, అద్భుతమైన సెంచరీతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అతని ఆల్‌రౌండ్ ప్రతిభను చూసిన క్రికెట్ విశ్లేషకులు రాజేష్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తన రోల్ మోడల్‌గా భావించే రాజేష్, మైదానంలో కూడా జడేజాలానే చురుగ్గా ఉంటూ జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు.

రాజేష్ కేవలం క్రికెట్‌లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో క్రమశిక్షణతో ఉంటాడు. ప్రస్తుతం ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఒకవైపు బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే, మరోవైపు క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. తాజాగా మహిపాల్ లోమ్రోర్ సారథ్యంలో ప్రకటించిన 15 మంది సభ్యుల రాజస్థాన్ రంజీ జట్టులో రాజేష్ బిష్ణోయ్ పేరు ప్రముఖంగా ఉంది. మానవ్ సుతార్, దీపక్ హుడా, అనికేత్ చౌదరి వంటి స్టార్ ఆటగాళ్లతో కలిసి రాజేష్ ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టును గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..