
Rajasthan Royals Release And Retention List: ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తీవ్ర నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి, వరుసగా రెండోసారి కూడా టాప్-4లోకి ప్రవేశించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో, నవంబర్ 15న రిటెన్షన్ గడువు ముగియనున్న తరుణంలో, రాజస్థాన్ రాయల్స్ జట్టులో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉంది. నాయకత్వ ప్రశ్నలు, జట్టులో స్థిరత్వం లేమి వంటి చర్చల మధ్య, రాజస్థాన్ మినీ-వేలానికి ముందు జట్టును పూర్తిగా పునర్నిర్మించాలని చూస్తోంది.
ఈ రిటెన్షన్ ప్రక్రియలో అత్యంత చర్చనీయాంశంగా సంజు శాంసన్ – రవీంద్ర జడేజా ట్రేడ్ డీల్. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాటర్ అయిన సంజు శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు పంపించి, బదులుగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ బదిలీ లీగ్‌లో పెను సంచలనం సృష్టించే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ తమ యువ భారత ఆటగాళ్ల బృందాన్ని పటిష్టంగా ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. వీరి చుట్టూనే 2026 సీజన్ జట్టును నిర్మించాలని యోచిస్తోంది.
యశస్వి జైస్వాల్: టాప్-ఆర్డర్‌లో విధ్వంసక బ్యాటర్‌గా జట్టులో స్థానం పదిలం.
ధ్రువ్ జురెల్: మిడిల్-ఆర్డర్‌లో నమ్మకమైన ఆటగాడిగా మెప్పిస్తున్నాడు.
రియాన్ పరాగ్: 2025 సీజన్‌లో పరాగ్ అద్భుత ప్రదర్శన అతని స్థానాన్ని సుస్థిరం చేసింది.
రవీంద్ర జడేజా జట్టులోకి వస్తే, రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు కెప్టెన్సీ అభ్యర్థులు అందుబాటులో ఉంటారు. భవిష్యత్తు నాయకుడిగా భావిస్తున్న యశస్వి జైస్వాల్, పరిణతితో కూడిన ధ్రువ్ జురెల్, అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా – ఈ ముగ్గురిలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకోవడం రాజస్థాన్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది.
రాజస్థాన్ రాయల్స్ నిలుపుకునే, విడుదల చేసే అవకాశం ఉన్న ఆటగాళ్ల జాబితా (అంచనా)
రిటెన్షన్ చేసే అవకాశం ఉన్న ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చారక్, జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగా, కుమార్ కార్తికేయ, అశోక్ శర్మ, శుభం దూబే, ల్హువాన్-డ్రే ప్రిటోరియస్, సందీప్ శర్మ.
విడుదల చేసే అవకాశం ఉన్న ఆటగాళ్లు: షిమ్రాన్ హెట్మైర్, తుషార్ దేశ్‌పాండే, నితీష్ రాణా, క్వెనా మఫాకా, ఆకాష్ మధ్వాల్, నాండ్రే బర్గర్, మహీష్ తీక్షణ, వనిందు హసరంగా, ఫజల్‌హక్ ఫారూఖీ.
ట్రేడ్ అయ్యే అవకాశం ఉన్న ఆటగాడు: సంజు శాంసన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..