అతడిని రక్షించడం కాదు.. ఎక్స్‌పోజ్ చేయండి.. గిల్, గంభీర్‌లను ఏకిపారేసిన మాజీ ప్లేయర్

హర్షిత్ రాణా ఎంపికపై గత కొన్ని నెలలుగా విమర్శలు వస్తున్నాయి. భారత క్రికెట్ జట్టులో హర్షిత్ రాణా ఉండాలా వద్దా అనేది అతని ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. జట్టు యాజమాన్యం అతనిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే, అతనికి సరైన పాత్ర, సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

అతడిని రక్షించడం కాదు.. ఎక్స్‌పోజ్ చేయండి.. గిల్, గంభీర్‌లను ఏకిపారేసిన మాజీ ప్లేయర్
Gautam Gambhir

Updated on: Oct 20, 2025 | 1:58 PM

Team India: క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఎంపిక, అతనిపై జరుగుతున్న విమర్శలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి తర్వాత, హర్షిత్ రాణా ఎంపికపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. జట్టు కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి, యువ ప్లేయర్‌ను రక్షించడం కాకుండా, అతడిని ఆటలో మరింత ‘ఎక్స్‌పోజ్’ చేయాలనే సూటి సందేశం వచ్చింది.

పెర్త్ ఓటమి తర్వాత పెరిగిన విమర్శలు..

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కూర్పుపై, ముఖ్యంగా యువ పేసర్ హర్షిత్ రాణా ఎంపికపై ప్రశ్నలు తలెత్తాయి. భారత జట్టు ముగ్గురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగగా, వికెట్ టేకింగ్ స్పిన్నర్ కులదీప్ యాదవ్‌కు చోటు దక్కలేదు. హర్షిత్ రాణాకు జట్టులో చోటు లభించినప్పటికీ, వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో అతను బంతితో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

గతంలో, కోచ్ గౌతమ్ గంభీర్, హర్షిత్ రాణాపై జరుగుతున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. రాణా ఎంపిక కేవలం అతని ప్రతిభ ఆధారంగానే జరిగిందని, వ్యక్తిగత దాడి చేయడం సిగ్గుచేటని మాజీ క్రికెటర్లను ఉద్దేశించి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

గంభీర్‌-గిల్‌కు మాజీ క్రికెటర్ ప్రియాంక్ పాంచాల్ సందేశం..

ఈ నేపథ్యంలో, భారత-ఏ జట్టు మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచాల్ సోషల్ మీడియా వేదికగా జట్టు మేనేజ్‌మెంట్‌కు, ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపారు. “హర్షిత్ రాణా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలడని మేనేజ్‌మెంట్ భావిస్తే, అదనపు బ్యాటర్‌ను చేర్చి అతన్ని రక్షించాల్సిన అవసరం లేదు. రాబోయే రెండేళ్లలో అతడిని ఆ పాత్రకు ‘ఎక్స్‌పోజ్’ చేయాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

హర్షిత్ రాణా బ్యాటింగ్ సామర్థ్యంపై నమ్మకం ఉంటే, అతడిని కేవలం బౌలర్‌గా ఉంచి, బ్యాటింగ్ బలహీనత నుంచి కాపాడటానికి మరొక బ్యాటర్‌ను ఆడించకూడదు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం హర్షిత్ రాణాను ఆల్‌రౌండర్‌గా చూడాలనుకుంటే, అతడికి మెరుగైన బ్యాటింగ్ అవకాశాలు ఇచ్చి, ఒత్తిడిలో ఆడేలా ప్రోత్సహించాలి.

దీంతో పాటు, పాంచాల్ కీలక వికెట్ టేకర్ అయిన కులదీప్ యాదవ్‌ను జట్టులో చేర్చాలని, అతడిని నితీష్ కుమార్ రెడ్డి లేదా వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆడించాలని కూడా సూచించారు.

హర్షిత్ రాణా వివాదం..

హర్షిత్ రాణా ఎంపికపై గత కొన్ని నెలలుగా విమర్శలు వస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) లో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉన్నప్పటి నుంచి రాణాకు గంభీర్‌తో మంచి అనుబంధం ఉంది. అందుకే గంభీర్ ప్రభావం వల్లే రాణాకు అన్ని ఫార్మాట్‌లలో అవకాశం దక్కుతుందని, అతను ‘యస్ మ్యాన్’ అంటూ మాజీ క్రికెటర్లు కృష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటివారు బహిరంగంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

ఈ విమర్శలకు గౌతమ్ గంభీర్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, “యూట్యూబ్ వ్యూస్ కోసం 23 ఏళ్ల యువకుడిని టార్గెట్ చేయడం సిగ్గుచేటు. నాపై విమర్శలు చేయండి, నేను భరించగలను. కానీ యువ ఆటగాడిని వదిలిపెట్టండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

భారత క్రికెట్ జట్టులో హర్షిత్ రాణా ఉండాలా వద్దా అనేది అతని ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. జట్టు యాజమాన్యం అతనిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే, అతనికి సరైన పాత్ర, సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పాంచాల్ సందేశం ప్రకారం, రాణాను ‘షీల్డ్’ చేయడం కాకుండా, అతడిని ఒత్తిడికి ‘ఎక్స్‌పోజ్’ చేసి, తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వడం ద్వారానే భవిష్యత్తులో అతను మెరుగైన ఆటగాడిగా ఎదుగుతాడని చెప్పవచ్చు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..