Asia Cup 2022: అలా జరిగితేనే రోహిత్ సేన ఫైనల్‌కు చేరుకుంటుంది.. లేదంటే ఇంటికే.!
మొన్న పాకిస్తాన్, నిన్న శ్రీలంక.. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్.. రెండింటిలోనూ టీమిండియా విఫలమైంది..
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. సునాయాసంగా వరుస విజయాలతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంటుందనుకుంటే.. సీన్ కాస్తా రివర్స్ అయింది. వరుస ఓటములతో ఇంటికి ముఖం పట్టేందుకు సిద్దమైంది రోహిత్ సేన. మొన్న పాకిస్తాన్, నిన్న శ్రీలంక.. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్.. రెండింటిలోనూ టీమిండియా విఫలమైంది. ఫైనల్ అవకాశాలను తుడిచిపెట్టేసుకుంది.
దుబాయ్ వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారీ టార్గెట్ చేధించే క్రమంలో లంక బ్యాట్స్‌మెన్లు ఏమాత్రం తడబడకుండా.. టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. వెరిసి రెండు మ్యాచ్‌లలోనూ అద్భుత విజయాలను అందుకుని ఫైనల్ స్పాట్‌ను ఖరారు చేసుకున్నారు. అటు టీమిండియా నిష్క్రమణకు దగ్గరైంది. అయితే శ్రీలంకపై ఓడిపోయినప్పటికీ టీమిండియా ఫైనల్ చేరేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. అదెలాగంటే..
ఇప్పుడు టీమిండియా ఫైనల్ చేరాలంటే.. ఇతర టీంల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ఇవాళ ఆఫ్ఘానిస్తాన్‌పై, శుక్రవారం శ్రీలంకపై పాకిస్తాన్ జట్టు ఓడిపోవాలి. అలాగే భారత్.. ఆఫ్గాన్‌పై భారీ తేడాతో గెలవాలి. అప్పుడే ప్రతీ టీంకు రెండేసి పాయింట్లు ఉంటాయి. ఇక ఇప్పుడు నెట్ రన్‌రేట్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. అందరికంటే మనది ఎక్కువగా ఉంటేనే ఫైనల్‌కు వెళ్తాం. అయితే ఇక్కడొక ట్విస్ట్.. ఒకవేళ ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై పాక్ గెలిస్తే.. రోహిత్ సేన ఇంటికి చేరడం ఖాయం.
కాగా, ఆసియా కప్‌లో భారత్ ఓటమిపాలవ్వడానికి ప్రయోగాలే కారణమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అనుభవం లేని ప్లేయర్స్‌ను జట్టులోకి తీసుకుని.. చేజేతులారా మ్యాచ్‌ను పోగొట్టుకున్నారని మండిపడుతున్నారు.