
India Vs West Indies: భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ పూర్తియింది. ప్రస్తుతం ఇరుజట్లు వైట్-బాల్ క్రికెట్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలుకానుంది. గురువారం, జులై 27న తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్.. వన్డే సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్‌నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను తలపిస్తున్న టీమ్‌ఇండియాకు ఈ వన్డే సిరీస్ విజయం ప్రతిష్ఠాత్మకంగా మారింది.
నిజానికి ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగుతున్న తొలి వన్డేపై వర్షం నీడ కొనసాగుతోంది. వాతావరణ సూచన ప్రకారం బ్రిడ్జిటౌన్ లో అడపాదడపా జల్లులు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
అక్యూవెదర్ అందించిన వాతావరణ సూచన ప్రకారం గురువారం బ్రిడ్జిటౌన్ గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అలాగే మ్యాచ్ మొత్తంలో 7 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మేఘావృతమైన వాతావరణం కూడా ఉంటుందని సమాచారం.