Video: 62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులు.. క్రికెట్ హిస్టరీలో చెరిగిపోని రికార్డ్.. ఎవరంటే?

Unbreakable Records: క్రికెట్ ప్రపంచంలో అసాధ్యం అనుకున్న రికార్డులను సుసాధ్యం చేసిన ఘనత వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయన్ లారాది. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం ఆయన నెలకొల్పిన 501 పరుగుల రికార్డు నేటికీ అజేయంగా నిలిచింది. నేడు ఆయన 57వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో, మైదానంలో ఆయన సృష్టించిన ఆ పరుగుల సునామీని మరోసారి గుర్తుచేసుకుందాం.

Video: 62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులు.. క్రికెట్ హిస్టరీలో చెరిగిపోని రికార్డ్.. ఎవరంటే?
Highest Individual Score In Cricket
Image Credit source: https://pixabay.com/

Updated on: May 02, 2026 | 5:02 PM

Highest Individual Score in Cricket: క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, అవి నిజమని నమ్మక తప్పదు. అటువంటిదే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బ్రయన్ లారా సాధించిన 501 పరుగుల భారీ ఇన్నింగ్స్. 1994లో జరిగిన ఒక మ్యాచ్‌లో లారా ఒంటిచేత్తో బౌలర్లను ఉతికేస్తూ అజేయంగా ఐదు వందల పైన పరుగులు సాధించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ఈ రికార్డు సృష్టించి నేటికి సుమారు 30 ఏళ్లు దాటినా, కనీసం ఆ రికార్డు దరిదాపుల్లోకి కూడా ఏ బ్యాటర్ రాలేదు.

డర్హమ్ బౌలర్లపై లారా పంజా..

1994 జూన్ నెలలో వార్విక్షైర్ జట్టు తరపున ఆడుతూ, డర్హమ్ జట్టుపై లారా ఈ చారిత్రక ఘనతను సాధించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లారా కేవలం 427 బంతుల్లోనే 501 పరుగులు చేశారు. ఇందులో 62 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆయన అప్పటివరకు హనీఫ్ మహ్మద్ పేరిట ఉన్న 499 పరుగుల రికార్డును చెరిపివేశారు. ఆయన ఆడిన ఆ మెరుపు ఇన్నింగ్స్ క్రికెట్ పుస్తకాల్లో సువర్ణ అక్షరాలతో లిఖితమైంది.

టెస్టుల్లోనూ 400 పరుగుల రారాజు..

కేవలం ప్రథమ శ్రేణి క్రికెట్లోనే కాకుండా, అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు లారా పేరిటే ఉంది. 2004 ఏప్రిల్ 12న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లారా అజేయంగా 400 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా ఆయన రికార్డు నేటికీ పదిలంగా ఉంది. నాడు ఆయన ఇన్నింగ్స్‌లో 43 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

రికార్డుల రారాజు ప్రస్థానం..

ట్రినిడాడ్‌లో జన్మించిన లారా, తన 20వ ఏటనే జట్టు పగ్గాలు అందుకున్న ప్రతిభావంతుడు. తన సుదీర్ఘ కెరీర్‌లో 131 టెస్టుల్లో 11,953 పరుగులు, 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించారు. టెస్టుల్లో 34 శతకాలు, వన్డేల్లో 19 శతకాలు బాదిన లారా, ప్రపంచ క్రికెట్ గర్వించదగ్గ గొప్ప బ్యాటర్లలో ఒకరిగా నిలిచిపోయారు. 11 మంది తోబుట్టువులలో పదవ వాడైన లారా, కఠిన శ్రమతో క్రికెట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆయన నెలకొల్పిన ఈ 501, 400 పరుగుల రికార్డులు ఇప్పట్లో బద్దలయ్యేలా కనిపించడం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us