BPL Crisis: మీ కక్కుర్తి పాడుగాను..బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ప్లేయర్ల డబ్బులు నొక్కేసిన ఢాకా క్యాపిటల్స్

BPL Crisis: బంగ్లాదేశ్ క్రికెట్‌లో మరోసారి భారీ కుంభకోణం బయటపడింది. ఆ దేశ ప్రతిష్టాత్మక టీ20 లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు ఆటగాళ్ల జీతాల ఎగవేత వివాదంతో అట్టుడుకుతోంది. కోట్లు వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు, ఇప్పుడు వారికి పైసలు చెల్లించకుండా మొహం చాటేస్తున్నాయి.

BPL Crisis: మీ కక్కుర్తి పాడుగాను..బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో  ప్లేయర్ల డబ్బులు నొక్కేసిన ఢాకా క్యాపిటల్స్
Bpl Crisis

Updated on: Jan 30, 2026 | 8:09 AM

BPL Crisis: బంగ్లాదేశ్ క్రికెట్‌లో మరోసారి భారీ కుంభకోణం బయటపడింది. ఆ దేశ ప్రతిష్టాత్మక టీ20 లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు ఆటగాళ్ల జీతాల ఎగవేత వివాదంతో అట్టుడుకుతోంది. కోట్లు వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు, ఇప్పుడు వారికి పైసలు చెల్లించకుండా మొహం చాటేస్తున్నాయి. ముఖ్యంగా ఢాకా క్యాపిటల్స్ జట్టు వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈసారి ఢాకా క్యాపిటల్స్ ఫ్రాంచైజీ చేసిన పనికి లీగ్ పరువు గంగలో కలిసింది. ఈ జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లకు వారి కాంట్రాక్ట్ మొత్తంలో కేవలం 27 శాతం మాత్రమే చెల్లించారు. నిబంధనల ప్రకారం టోర్నీ మొదలయ్యే ముందు 25%, టోర్నీ జరుగుతున్నప్పుడు 50%, ముగిసిన నెల రోజుల్లో మిగిలిన 25% చెల్లించాలి. కానీ ఈ జట్టు మాత్రం ప్రారంభంలో ఇచ్చిన 25% దాటి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు.

పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఈ జట్టుకు ఆడిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఇమాద్ వసీం తనకు రావాల్సిన డబ్బులు అందకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ టోర్నీ మధ్యలోనే పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లిపోయారు. ఢాకా క్యాపిటల్స్ సీఈఓ అతీక్ ఫహద్ ఆటగాళ్ల ఫోన్లు కూడా ఎత్తడం లేదని సమాచారం. ఈ జట్టులో దాసున్ షనక, అలెక్స్ హేల్స్, తస్కిన్ అహ్మద్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, యాజమాన్యం తీరు వల్ల అందరూ ఇప్పుడు రోడ్డున పడ్డారు.

ఢాకా ఒక్కటే కాదు, నోఖాలీ ఎక్స్‌ప్రెస్ అనే మరో జట్టు కూడా ఇదే దారిలో ఉంది. ఈ ఫ్రాంచైజీ ఇచ్చిన చెక్కులు బ్యాంకుల్లో బౌన్స్ అవుతున్నాయి. దీంతో విసిగిపోయిన ఆటగాళ్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుని ఆశ్రయించారు. ఫ్రాంచైజీలు జమ చేసిన బ్యాంక్ గ్యారెంటీ (సుమారు 5 కోట్ల టకా)ను ఉపయోగించి తమ బకాయిలు తీర్చాలని కోరుతున్నారు. ఢాకా టీమ్ యజమానులు ఇప్పటివరకు బీసీబీకి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.

ఈ పరిణామాలతో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతింది. రాబోయే సీజన్లలో విదేశీ ఆటగాళ్లు ఈ లీగ్‌కు రావడానికి భయపడే అవకాశం ఉంది. బీసీబీ జోక్యం చేసుకుని ఫ్రాంచైజీలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, లీగ్ మనుగడ కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల కష్టార్జితాన్ని ఎగవేస్తున్న ఇటువంటి జట్లపై శాశ్వత నిషేధం విధించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..