భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) రాజీనామా చేశారన్న వార్తలను సెక్రటరీ జే షా(Jay Shah) తోసిపుచ్చారు. క్రికెటర్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ కార్యదర్శి జయ్ షా, రాజీనామా ఊహాగానాలకు ముగింపు ఇస్తూ, గంగూలీ రాజీనామా చేయలేదని వార్తా సంస్థకు స్పష్టంగా చెప్పారు. కొద్దిసేపటి క్రితం గంగూలీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎందరికో ఉపయోగపడే ఓ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
“1992లో క్రికెట్లో అడుగుపెట్టాను. 2022తో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నా. నాటి నుంచి క్రికెట్ నాకెంతో ఇచ్చింది. మరీ ముఖ్యంగా మీ మద్దతును నాకు అందించింది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు సహకరించిన, నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎందరికో ఉపయోగపడే ఓ పని ప్రారంభించాలని ఈ రోజు నిర్ణయించుకున్నా. నా జీవితంలో ఈ సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న వేళ మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా” అని దాదా ట్వీట్ చేశారు.
— Sourav Ganguly (@SGanguly99) June 1, 2022
ఇదిలావుంటే గంగూలీ రాజకీయాల్లోకే అడుగుపెడతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దాదా.. బీజేపీలో చేరనున్నారని పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆయనను రాజ్యసభకు పంపిస్తారని ఊహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయనున్నారనేది గంగూలీనే త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేశారని వార్తలు రాగా.. అలాంటిదేం లేదని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టత ఇచ్చారు.
Sourav Ganguly has not resigned as the president of BCCI: Jay Shah, BCCI Secretary to ANI pic.twitter.com/C2O3r550aL
— ANI (@ANI) June 1, 2022
సౌరవ్ గంగూలీ కెరీర్
గంగూలీ 188 ఇన్నింగ్స్‌లలో 113 టెస్టుల్లో 42.17 సగటుతో 51.25 స్ట్రైక్ రేట్‌తో 7212 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 35 అర్ధ సెంచరీలు, 16 సెంచరీలు చేశాడు. టెస్టులో అతని అత్యధిక స్కోరు 239 పరుగులు. అతను భారతదేశం తరపున 311 ODIల్లో 41.02 సగటుతో, 73.70 స్ట్రైక్ రేట్‌తో 11363 పరుగులు చేశాడు. వన్డేల్లో 72 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 183 పరుగులు. ఇది కాకుండా అతను 77 T20 మ్యాచ్‌లలో 25.01 సగటు, 107.00 స్ట్రైక్ రేట్‌తో 1726 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 8 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు.